బాబాయ్ తరఫున అబ్బాయ్ ప్రచారం
ఏపీలో ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీ నాయకులు హోరెత్తిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 28 April 2024 8:00 AM ISTబాబాయ్ తరఫున అబ్బాయ్ ప్రచారం
ఏపీలో ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీ నాయకులు హోరెత్తిస్తున్నారు. కొద్దిరోజుల్లోనే ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో జోరుగా ప్రజల్లో తిరుగుతూ తమ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. అయితే.. తాజాగా ఎన్నికల ప్రచారంలోకి మెగా హీరో ఎంట్రీ ఇచ్చాడు. తన బాబాయ్ పవన్ కల్యాణ్ కోసం.. హీరో వరుణ్ తేజ్ ప్రచారంలోకి దిగాడు. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించాడు.
గొల్లప్రోలు మండలం తాటిపర్తి, కొడవలి, చెందుర్తి గ్రామాల్లో నిర్వహించిన బైకు ర్యాలీ, రోడ్ షోలో హీరో వరుణ్ తేజ్ పాల్గొన్నాడు. దుర్గాడలో బహిరంగ సభ నిర్వహించగా.. అక్కడ పాల్గొని ప్రసంగించాడు. .. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రజలే కుటుంబ సభ్యులు అని చెప్పాడు. 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ విజయం సాధించకపోయినా ప్రజలకు మేలు చేస్తూనే ఉన్నారని చెప్పాడు. ఈసారి ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ను గెలిపిస్తే ప్రజలకు మరింత సేవ చేస్తారని చెప్పారు. పదవిలో లేకపోతేనే చాలా చేసిన పవన్ కల్యాణ్‌కు ఒక్కసారి పదవి ఇచ్చి చూడండి ఎంత మేరకు పనులు చేసిపట్టగలరో అని చెప్పాడు. పవన్ కల్యాణ్ అప్పులు చేసి మరీ కౌలు రైతులకు సాయం అందించారని వరుణ్ తేజ్ చెప్పాడు. జనసేన అభ్యర్థులతో పాటు కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా వరుణ్ తేజ్ కోరాడు.
పిఠాపురం ప్రజలను పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారని వరుణ్ తేజ్ అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్నీ అభివృద్ధి చేస్తారని చెప్పారు. చిరంజీవితో పాటు మెగా కుటుంబం మొత్తం పవన్ బాబాయ్ వెనకే ఉందని ఈ సందర్భంగా వరుణ్ తేజ్ చెప్పాడు. ఇక వరుణ్ తేజ్‌కు అంతకుముందు జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తాటిపర్తిలో వరుణ్ తేజ్‌కు మామిడిపండ్ల బుట్టను అందజేశారు. తండ్రి నాగబాబుతో కలిసి వరుణ్ తేజ్ పాదగయ క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.