చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తా: జయరాం
వైసీపీ పార్టీకి షాక్ ఇచ్చి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు.
By Srikanth Gundamalla Published on 6 March 2024 4:09 PM ISTచంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తా: జయరాం
వైసీపీ పార్టీకి షాక్ ఇచ్చి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు. అయితే.. తాజాగా ఆలూరుకు చెందిన పలువురు వైసీపీ నాయకులను ఆయన టీడీపీలో చేరిపించారు. దాదాపు వంద మందికి పైగా ముఖ్య నాయకులకు పచ్చ కండువా కప్పించారు. వారందరికీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే.. ఈ సందర్భంగా మాట్లాడిన గుమ్మనూరు జయరాం ఆసక్తికర కామెంట్స్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఏ పదవి అప్పగించినా కూడా తాను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని గుమ్మనూరు జయరాం చెప్పారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాతే తాను టీడీపీలో చేరినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక తాను పదవి వదులుకున్న తర్వాత కూడా బర్తరఫ్ చేశారనీ చెప్పారు. వారు ఎలాంటి బర్తరఫ్ చేసినా తాను ముందే పదవిని వదులుకున్నా కాబట్టి అవన్నీ తనకు అనవసరమని గుమ్మనూరు జయరాం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు తనని ఎక్కడి నుంచి పోటీ చేయమాన్నా.. దానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇంతకుముందు ఆలూరుకు సేవలు అందించానని ఈ సందర్భంగా చెప్పారు. ఈ సారి గుంతకల్లు నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తన మనసులో ఉన్న మాటను తెలిపారు గుమ్మనూరు జయరాం. అయితే.. తాను ఇప్పుడే పార్టీలో చేరాను కాబట్టి.. ఇప్పటికే ఆ స్థానంపై ఎవరైనా ఆశలు పెట్టుకుని ఉండొచ్చు కూడా అన్నారు. అందరినీ కలుపుకొనే ముందుకు పోతానని ఈ సందర్భంగా చెప్పారు. చంద్రబాబు రాష్ట్రానికి మరోసారి సీఎం కావాలని.. ఆంధ్రప్రదేశ్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా గుమ్మనూరు జయరాం చెప్పారు.
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుని తొలి విడత అభ్యర్థులను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో పలువురు అసంతృప్త నేతలు చంద్రబాబుని వరుసగా కలుస్తున్నారు. దాంతో.. ఆయన కూడా పార్టీ గెలుపు ముఖ్యమనీ.. రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయనీ చెబుతున్నారు. పార్టీ నేతలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.