వైసీపీని తిట్టడానికే సీఎం చంద్రబాబు పరిమితం అయ్యారు: గుడివాడ అమర్నాథ్
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై వైసీపీ మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 12 July 2024 12:30 PM ISTవైసీపీని తిట్టడానికే సీఎం చంద్రబాబు పరిమితం అయ్యారు: గుడివాడ అమర్నాథ్
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై వైసీపీ మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు చేశారు. ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అభివృద్ధిపై కంటే.. వైపీపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఉత్తరాంధ్రపై చంద్రబాబుకి ఉన్నది సవతి తల్లి ప్రేమ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. ఉత్తరాంధ్రకు ఏం చేస్తారో చెప్పడం లేదన్నారు. వైసీపీపై నిందలు వేయడమే ముఖ్య ఉద్దేశంగా మాట్లాడుతున్నారని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకి ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ ప్రపంచంలో మరే రాజకీయ నాయకుడికి ఉండవంటూ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.
భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఉన్న భూ సమస్యలు సహా అన్నింటిని పరిష్కరించి వైసీపీ ప్రభుత్వంలోనే పనులు ప్రారంభం అయ్యాయని గుడివాడ అమర్నాథ్ వివరించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభించే నాటికి ప్రభుత్వం దగ్గర 377 ఎకరాల మాత్రమే ఉందనీ.. పరిహారం, కోర్టు కేసులు ఎదుర్కొని తాము ముందుకెళ్లామని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. కూటమి ప్రభుత్వ ఉడత బెదిరింపులకు వైసీపీ నాయకులు, శ్రేణులు భయపడరు అంటూ కామెంట్స్ చేశారు. వైసీపీ పై టీడీపీ, జనసేన ఎన్ని కుట్రలు చేసినా భయపడబోము అని అన్నారు. ప్రజలకు మంచి జరగాలనే వైసీపీ ఎప్పుడూ కోరుకుంటుందని అన్నారు. అలాగే ప్రభుత్వానికి కూడా ప్రజలకు చేసే మంచి గురించే ఆలోచించాలి కానీ.. ఇలా ఇబ్బందులు పెట్టే ఆలోచనలు కాదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం వైఎస్ జగన్ ఎనలేని కృషి చేశారని మాజీ మంత్రి అమర్నాథ్ చెప్పుకొచ్చారు.