గాంధీభవన్‌లో పోస్టర్ల కలకలం..వారి సంగతి తేలుస్తానన్న మధుయాష్కి
గాంధీ భవన్ వద్ద మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్‌కు వ్యతిరేకంగా పోస్టులు వెలిశాయి.
By Srikanth Gundamalla Published on 4 Sep 2023 12:55 PM GMTగాంధీభవన్‌లో పోస్టర్ల కలకలం..వారి సంగతి తేలుస్తానన్న మధుయాష్కి
Hyderabad: గాంధీ భవన్ వద్ద మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్‌కు వ్యతిరేకంగా పోస్టులు వెలిశాయి. గో టు నిజామాబాద్, ఎల్బీనగర్‌కు రావొద్దంటూ పోస్టర్లలో ప్రింట్ చేయించి అతికించారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యిన విషయం తెలిసిందే. కాగా.. ఈ పోస్టర్లను మధుయాష్కిగౌడ్‌ను ఉద్దేశించి రాశారు. దీనిపై స్పందించిన ఆయన.. ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వెలిసిన పోస్టర్ల వెనుక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హస్తం ఉందని మండిపడ్డారు. సుధీర్‌రెడ్డి కాంగ్రెస్‌ను మోసం చేసిన వ్యక్తి అని.. ఓటమి భయంతోనే తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ మధుయాష్కి గౌడ్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోవర్టుల సంగతి తేలుస్తానని అన్నారు మధుయాష్కిగౌడ్. సుధీర్‌రెడ్డి ఎంగిలి మెతుకులకు ఆశపడే వ్యక్తి అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇకనైనా ఎంగిలి మెతుకులు తినడం మానేసుకోవాలని చెప్పారు. నిజమైన కార్యకర్తలను కాపాడుకోవాలని మధుయాష్కి అన్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని.. తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు ప్రజలు గుడ్‌బై చెప్తారని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు కనీసం 25 సీట్లు కూడా రావని మధుయాష్కిగౌడ్ జోస్యం చెప్పారు. కాగా.. ఎల్బీనగర్ నుంచి పోటీ చేసేందుకు మధుయాష్కి గౌడ్ దరఖాస్తు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
కాగా.. గాంధీ భవన్ వద్ద పోస్టర్లు కలకలం రేపడంపై.. ఎల్బీనగర్ కాంగ్రెస్ ఇంచార్జ్ జక్కిడి ప్రభాకర్ కూడా స్పందించారు. తనపై ఆరోపణలు చేయొద్దని.. ఆ పోస్టర్లు అంటించింది తాను కాదని అన్నారు. వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎల్బీనగర్‌లో చేసిన సర్వేలో తాను గెలుస్తానని తెలిసిందని.. సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయని అన్నారు జక్కిడి ప్రభాకర్. ఆయన కూడా కాంగ్రెస్ నుంచి ఎల్బీనగర్ టికెట్ తనకే వస్తుందని దీమా వ్యక్తం చేశారు. తన గెలుపు కోసం నియోజకవర్గంలో పనులు చేసుకుంటూ పోతున్నానని జక్కిడి ప్రభాకర్ అన్నారు. అయితే..ఒక వైపు మధుయాష్కి సీనియర్ నాయకుడు కావడం.. మరోవైపు జిక్కిడి ప్రభాకర్ ఎల్బీనగర్ టికెట్ ఆశిస్తుండటంతో.. కాంగ్రెస్ ఏం చేయాలా అని ఆలోచిస్తోంది. ఇద్దరినీ సంతృప్తి పరిచేలా నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.