ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో దాదాపు ఐదు నెలల తరువాత నేడు(మంగళవారం) చమురు ధరలను పెంచాయి చమురు సంస్థలు. లీటర్ పెట్రోల్ పై 80 పైసలు పెంచేశాయి. అలాగే వంటగ్యాస్ సిలిండర్ ధర ను కూడా రూ.50 పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయని వెల్లడించాయి.
ఇక పెట్రోల్, ఎల్పీజీ ధరల పెంపుదలను నిరసిస్తూ ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయసభలు దద్దరిల్లాయి. ఈ ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు చమురు ధరలపై ఆందోళన చేపట్టారు. ఎల్పీజీ సిలిండర్ల ధరలు తగ్గించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఆందోళనల నేపథ్యంలో ఛైర్మన్ వెంకయ్య నాయుడు సభను తొలుత 12 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనా.. మరోసారి వెల్‌లోకి విపక్ష సభ్యులు దూసుకొచ్చి నినాదాలతో హోరెత్తించడంతో సభ నేటి మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు.
అటు లోక్‌సభలోనూ ఉదయం ప్రశ్నోత్తరాల సమయం పూర్తికాగానే కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరి చమురు ధరల అంశాన్ని లేవనెత్తారు. ప్రతిపక్షపార్టీలు ఎప్పటి నుంచో చెబుతున్నట్లుగా ఎన్నికల అనంతరం ధరలు పెంచారని ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్, తృణముల్, ఎన్సీపీ, డీఎంకే, వామపక్ష పార్టీ సభ్యులు ధరల పెంపునకు నిరసగా నినాదాలు చేశాయి. ఇక విపక్షాలు మాట్లాడేందుకు స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు.