Telangana: త్వరలో కేబినెట్ విస్తరణ.. అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య హోరాహోరీ పోరు
సంక్రాంతి తర్వాత తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో పదవులు దక్కించుకోడానికి అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Jan 2025 1:23 PM ISTత్వరలో కేబినెట్ విస్తరణ.. అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య హోరాహోరీ పోరు
సంక్రాంతి తర్వాత తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో పదవులు దక్కించుకోడానికి అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో 12 మంది మంత్రులు ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత మొత్తం మంత్రుల సంఖ్య 18కి పెరగనుంది. ఇందుకు సంబంధించి వివిధ వర్గాల నుండి ఆశావహులు చాలా ఎక్కువగా ఉన్నారు. పదవుల కోసం పలు సామాజిక వర్గాల మధ్య పోటీ నెలకొంది. మంత్రి వర్గ విస్తరణలో ఎవరికి పదవి దక్కుతుందా అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ప్రతిపక్షాలకు, తెలంగాణ ప్రజలకు ఐక్యత చాటేందుకు అగ్రనేతలు ఐక్యంగా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం కేడర్ కు పిలుపునిచ్చింది.
ఒక్క బెర్త్ కోసం వారి మధ్య పోరు:
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మంత్రి పదవికి సంబంధించిన పోటీలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ కేబినెట్ మంత్రి పదవికి కోసం తమదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. అంతర్గత తగాదాల కారణంగా మంత్రివర్గ విస్తరణకు సమయం పట్టిందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వివరించారు. రెడ్డి ఎమ్మెల్యేల మధ్య తీవ్ర పోటీ నెలకొని కేబినెట్ పదవుల కోసం వారంతా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందరినీ ప్రసన్నం చేసుకోవడం అంత సులువు కాకపోవడంతో న్యూఢిల్లీలోని హైకమాండ్ కాస్త ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంది. రెడ్డి సామాజికవర్గంలో ఒకరికి మాత్రమే మంత్రి పదవి వచ్చేలా ఉంది.
మరో బెర్త్ కోసం వెలమ వర్గం పోరాడుతూ ఉంది:
వెలమ సామాజికవర్గానికి ఇప్పటికే ఎక్సైజ్ టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి ఉన్నారు. అయితే మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా క్యాబినెట్ స్థానం కోసం లాబీయింగ్ చేస్తున్నారని అంతర్గత సమాచారం.
షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన వర్గాల పరిస్థితి:
ఇతర వర్గాల్లోనూ పోటీ తక్కువేమీ కాదు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలతో టచ్‌లో ఉన్నారనే ఆరోపణలు రావడంతో ఆ రాజకీయ నేతలకు ‘బహిరంగ’ ఛాలెంజ్ కూడా విసిరారు. "కొందరు కాంగ్రెస్‌లోకి రాకముందు ఇతర పార్టీలతో ఉన్నారు. వారందరికీ అవకాశం కల్పించడం కష్టం. తమ ఇగోలు పార్టీకి చేటు చేస్తోందని వారు గుర్తించడం లేదు. కొందరిని మాత్రమే ఎంపిక చేయవచ్చు, నియామకాలు జరగని కార్పొరేషన్లలో మిగిలిన వారికి ఇతర పోస్టులు ఇవ్వనున్నారు” అని ఒక సీనియర్ నాయకుడు తెలిపారు.
మైనారిటీలు సంతోషంగా లేరు
మైనార్టీలను బుజ్జగించేందుకు ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్సీని నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మార్చి 2025లో ఆరు MLC సీట్లు ఖాళీ అవుతాయి. రాష్ట్ర మంత్రివర్గంలో మైనారిటీలు ఎవరూ లేరు. మైనారిటీలు తమకు అందుతున్న ఆదరణతో సంతృప్తి చెందడం లేదని, ఇతర వర్గాలతో సమానంగా తమ ప్రాతినిధ్యం ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.
హోం, హోసింగ్ విభాగాలకు బలమైన మార్గదర్శకత్వం అవసరం:
రాష్ట్రంలోని ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (BRS) నుండి ఈ శాఖలకు నిరంతరం సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. హోం, విద్యా మంత్రిత్వ శాఖలకు బలమైన మంత్రులు అవసరం. ఈ రెండు శాఖలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నాయి. ఈ నష్టాలను ఇప్పుడు నియంత్రించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నాయకులు వివరించారు.
కాంగ్రెస్ అట్టడుగు స్థాయి ప్రజలకు చేరువ కావాలి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిపిసి) కొత్త అధ్యక్షుని నియామకం పూర్తయినప్పటికీ, ప్రభుత్వ కార్యక్రమాల గురించి అట్టడుగు స్థాయి ప్రజలకు తెలియడం లేదని పార్టీ కార్యకర్తలు అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కొత్త ఉపాధ్యక్షులు, కమిటీ సభ్యులను నియమించి ప్రభుత్వ విజయాలను చాటిచెప్పడమే వారి ముందున్న కర్తవ్యం. అయితే, రైతు రుణమాఫీ, సంక్షేమ గ్రాంట్‌లకు సంబంధించి ప్రభుత్వ పథకాలపై చురుగ్గా ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలు పార్టీని కోరుతున్నారు.
కాంగ్రెస్ క్యాడర్ ఏమి కోరుకుంటోంది?
పార్టీ పెద్దల నుండి సరైన మద్దతు లేకుండా, కాంగ్రెస్ కార్యకర్తలు BRS కార్యకర్తలతో నిరంతరం ఘర్షణ పడుతున్నారు. వారు అన్ని సందర్భాల్లోనూ బీఆర్ఎస్ ను ఎదుర్కోలేకపోతున్నారు. “ గ్రౌండ్ లెవెల్‌లో, సోషల్ మీడియాలో, టీవీ డిబేట్‌లలో, ఇతర పబ్లిక్ ఫోరమ్‌లలో ఎదుర్కోవాలి, నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రుల నుండి సరైన కమ్యూనికేషన్ అందాలి. ఈ గొలుసు విచ్ఛిన్నం కాకూడదు, దీనిని ప్రతిపక్షాలు ఉపయోగించుకుంటాయి." అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.
ఏది ఏమైనప్పటికీ, సంక్రాంతి తర్వాత తుది పేర్లను ప్రకటించే అవకాశాలు ఎక్కువ. ఆశాభంగం కలిగిన నాయకులు ఏమి చేస్తారోనని కాంగ్రెస్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.