గజ్వేల్ ఎన్నిక కురుక్షేత్రం లాంటిది: ఈటల రాజేందర్
హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో జరిగిందే ఇప్పుడూ గజ్వేల్‌లో రిపీట్ అవుందని ఈటల అన్నారు
By Srikanth Gundamalla
గజ్వేల్ ఎన్నిక కురుక్షేత్రం లాంటిది: ఈటల రాజేందర్
తెలంగాణలో ఎన్నికల హీట్ కొనసాగుతోంది. రాష్ట్రంలో నవంబర్ 30 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరందుకున్నాయి. అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తుంటే.. దానికి బదులుగా అధికారపార్టీ బీఆర్ఎస్ కౌంటర్లు వేస్తూనే ఉంది. ఈ క్రమంలో తెలంగాణలో ప్రచార జోరు కొనసాగుతోంది. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నిక ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్‌పై బీజేపీ అభ్యర్థిగా ఈటల నిలబడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్‌ను ఓడించి తీరతామంటూ కమలం పార్టీ నాయకులు దీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో జరిగిందే ఇప్పుడూ గజ్వేల్‌లో రిపీట్ అవుందని అన్నారు. అయితే.. గురువారం వర్గల్ సర్వసతీదేవి ఆలయంలో ఆయన పూజలు చేశారు. ఆ తర్వాత అర్చకుల నుంచి ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం గజ్వేల్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గజ్వేల్‌లో ఎన్నికలు కురుక్షేత్రం లాంటివన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్‌కు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు ఈటల రాజేందర్.
గజ్వేల్‌లో ఏ పార్టీ అయినా సరే మీటింగ్ పెట్టుకోవచ్చు అని ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ నిర్వహించే సభలు, సమావేశాలకు రాకుండా ప్రజలను స్థానిక బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దావత్‌లు, పైసలు ఇచ్చి మీటింగ్‌లకు రాకుండా ఆపేస్తున్నారని చెప్పారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో కూడా ఇలాగే చేశారని.. కానీ అక్కడ ప్రజలు ప్రలోభాలకు లొంగలేదని చెప్పారు. డబ్బు పంపకాలకు హుజూరాబాద్ ప్రజలు పాతరేసి ధర్మాన్ని, న్యాయాన్ని గెలిపించారని పేర్కొన్నారు. ఎన్ని కుయుక్తులు చేసినా గజ్వేల్‌లో బీజేపీ గెలుపు ఖాయమని ఈటల రాజేందర్ దీమా వ్యక్తం చేశారు.