మునుగోడు ఉప ఎన్నిక వేళ బీజేపీకి భారీ షాక్.. పార్టీకి దాసోజు శ్రవణ్ బై బై
Dasoju Sravan resigns to BJP.మునుగోడు ఉప ఎన్నిక వేళ భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి గట్టి షాక్ తగిలింది
By తోట వంశీ కుమార్ Published on 21 Oct 2022 7:45 AM GMTమునుగోడు ఉప ఎన్నిక వేళ భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి గట్టి షాక్ తగిలింది. కొద్ది నెలల క్రితం బీజేపీలో చేరిన ఆయన తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో దశ, దిశాలేని రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపారు.
"ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తాం అని చెప్పిన మీరు మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరిస్తున్న రాజకీయ తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. పార్టీ తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. సామాజిక బాధ్యత లేకుండా ఎన్నికలు అనగానే డబ్బు సంచులు గుప్పించాలన్నట్లుగా బడా కాంట్రాక్టర్లే రాజ్యాలేలాలే, పెట్టుబడి రాజకీయాలు చేయాలన్నట్లు కొనసాగిస్తున్న వైఖరి.. నాలాంటి బలహీన వర్గాలకు చెందిన నాయకులకు స్థానం ఉండదని తేటతెల్లమైంది.
అనేక ఆశలతో ఆశయాలతో నేను బీజేపీలో చేరినప్పటికీ దశాదిశాలేని నాయకత్వ ధోరణులు, నిర్మాణాత్మ రాజకీయాలకు కానీ తెలంగాణ సమాజానికి కానీ ఏ మాత్రం ఉపయోగకరంగా లేవని అనతికాలంలోనే అర్థమైంది.
ప్రజాహితమైన పథకాలతో, నిబద్ధత కలిగిన రాజకీయ సిద్దాంతాలతో ప్రజలను మెప్పించడం కంటే మందు, మాంసం విచ్చలవిడిగా నోట్ల కట్టలు పంచడం తద్వారా మునుగోడు ఎన్నికలలో గెలుపు సాధించాలనుకుంటున్న మీ తీరు పట్ల నిరసన తెలియజేస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను." అని శ్రవణ్ తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఈ రోజు సాయంత్రం మంత్రి కేటీఆర్ సమక్షంలో దాసోజు శ్రవణ్ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)లో చేరనున్నట్లు సమాచారం.