ఉత్కంఠకు తెర.. కాంగ్రెస్‌లో చేరిన డి శ్రీనివాస్
గాంధీభవన్‌లో డి శ్రీనివాస్, ఆయన కుమారుడు సంజయ్ తిరిగి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు
By తోట వంశీ కుమార్ Published on 26 March 2023 7:50 AM GMTకాంగ్రెస్‌లో చేరిన డి శ్రీనివాస్
మాజీ మంత్రి డి.శ్రీనివాస్ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఆయన కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్‌తో కలిసి గాంధీభవన్‌కు వచ్చిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లు ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, పొన్నాల లక్ష్మయ్య, రేణుకా చౌదరి తదితరులు పాల్గొన్నారు.
అంతకముందు వీల్‌ఛైర్‌లో గాంధీభవన్‌కు వచ్చిన డీఎస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో తిరిగి చేరుతుండటం ఎంతో ఆనందంగా ఉందని, సొంత ఇంటికి వచ్చినట్లు ఉందన్నారు. తన పెద్దకొడుకు ధర్మపురి సంజయ్‌తో కలిసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అలాగే మరో నేత మేడ్చల్ సత్యనారాయణ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తెలంగాణ కాంగ్రెస్ లక్కీ మాస్కెట్, 2 సార్లు ఆయన పీసీసీగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది.
— Telangana Congress (@INCTelangana) March 26, 2023
కాంగ్రెస్ మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి రాబోతుందని కాలం ఇచ్చే ఒక సంకేతం, మాజీ మంత్రి & పీసీసీ అధ్యక్షుడు, బీసీ నాయకుడు, పెద్దలు, డీ శ్రీనివాస్ కాంగ్రెస్ పునరాగమనం. pic.twitter.com/6JXBT4xctZ
రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారు డి. శ్రీనివాస్. కొంతకాలం తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు పెద్ద కుమారుడు సంజయ్ కూడా కారు ఎక్కారు. ఆ పార్టీ నుంచి డీఎస్ కు రాజ్యసభ సభ్యుడిగా కూడా అవకాశం లభించింది. కొంతకాలం బాగానే ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో ఆ పార్టీకి దూరం అయ్యారు. పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాల్లో కూడా పాల్గొనటం లేదు. ఇదే సమయంలో ఆయన చిన్నకుమారుడు అర్వింద్ 2019 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా గెలవడంతో డీఎస్ కూడా బీజేపీలో చేరుతారని బావించారు. అయితే.. ఆయన అనూహ్యంగా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ఆదివారం గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వి.హెచ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్, కోదండ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేణుకా చౌదరి, స్థానిక నేతలు దీక్ష చేపట్టారు. సాయంత్రం 5గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది.