ఎర్రబెల్లి ద్రోహంతోనే జైలుకు వెళ్లాల్సి వచ్చింది: రేవంత్‌రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ ప్రత్యర్థుల మధ్య విమర్శల దాడులు పెరుగుతూనే ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 9 Nov 2023 1:02 PM GMTఎర్రబెల్లి ద్రోహంతోనే జైలుకు వెళ్లాల్సి వచ్చింది: రేవంత్‌రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ ప్రత్యర్థుల మధ్య విమర్శల దాడులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. గురువారం పాలకుర్తిలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్‌రెడ్డి పాల్గొని.. ఎర్రబెల్లి దయాకర్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు శత్రువులతో చేతులు కలిపి తనకు ద్రోహం చేశారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. అందువల్లే తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందంటూ ఆరోపణలు చేశారు. అయితే.. ఎర్రబెల్లి దయాకర్‌రావు 40 ఏళ్ల క్రితం డీలర్‌గా ఉండేవాడని.. కానీ ఇప్పుడు డాలర్ దయాకర్‌రావుగా ఎలా మారారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు నమ్మక ద్రోహి.. మిత్ర ద్రోహి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్‌రెడ్డి.
40 ఏళ్లుగా పాలకుర్తిలో ఎర్రబెల్లి ఏకచత్రాధిపత్యం వహించారనీ.. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఎర్రబెల్లి ఏం చేశారని ప్రశ్నించారు. వందలాది మంది సర్పంచ్‌లు ఆందోళనలు, ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. తండాలు, ఆదివాసీ గూడాల్లో ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆ సర్పంచ్‌లకు బిల్లులు ఇచ్చిన పాపాన పోలేదంటూ ఆరోపించారు రేవంత్‌రెడ్డి. పాలకుర్తి ప్రాంతంలో రూ.360 కోట్లతో ప్రారంభించిన రిజర్వాయర్ ఖర్చును రూ.700 కోట్లకు పెంచి రూ.250 కోట్లు ఎర్రబెల్లి దయాకర్‌రావే దోచుకున్నారంటూ రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు దోచుకుంటుంటే.. రాజేందర్ రెడ్డి కుటుంబం దానధర్మాలు చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఏనాడూ ఎర్రబెల్లి దయాకర్‌రావు సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి కృషి చేయలేదన్నారు. రేషన్ డీలర్‌గా జీవితం ప్రారంభించిన ఎర్రబెల్లికి ఎప్పుడు వందల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయంటూ ప్రశ్నించారు. నమ్మించి మోసం చేయడంలో ఎర్రబెల్లిని మించిన వారు మరొకరు ఉండరంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శలు చేశారు.