సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేసీఆర్ అవినీతి, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నానని, అందుకే తనపై రాజకీయ కుట్ర పన్ని అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని ఆరోపించారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరుతున్నట్లు తన అనుకూల మీడియా సంస్థల ద్వారా దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల తాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు. దాన్ని ఆసరాగా తీసుకుని తాను పార్టీ మారుతున్నానని పుకార్లు పుట్టిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
''నేను అమిత్‌షాను కలవడం ఇదే తొలిసారి కాదు. నల్గొండ జిల్లా సమస్యలపై అనేకసార్లు అమిత్ షాతో భేటీ అయ్యా. నాపై అసత్య ప్రచారాలు చేయడం ద్వారా నా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలను గందరగోళానికి గురయ్యేలా చేయాలనేది కేసీఆర్ ప్లాన్‌గా తెలుస్తోంది'' అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని ఒక్కపైసా కూడా కేసీఆర్ అదనంగా కేటాయించలేదన్నారు. రాత్రికి రాత్రే డబ్బు సంచులు రెడీ చేసుకుని ఇతర పార్టీల నాయకులను కొనేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.
''నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో చర్చించకుండా నేను ఎలాంటి నిర్ణయం తీసుకోను. వెనుకబడిన మునుగోడు నియోజకవర్గాన్ని సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటలతో సమానంగా అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ ముందుకొస్తే నేను ఏ త్యాగానికైనా సిద్ధం'' అని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. గతంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వీడనున్నట్లు ప్రకటించి, ఆ తర్వాత అలాంటిదేం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కి అసలు బతుకే లేదని, కాంగ్రెస్ గెలిస్తే సీఎం పదవి తనకు రావొచ్చని చెప్పారు. అయితే తమ్ముడు రాజగోపాల్ రెడ్డి తీరుపై అన్న వెంకటరెడ్డి ఏం సమాధానమిస్తారంటూ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు మండిపడుతున్నారట.