జానారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ హైకమాండ్

కాంగ్రెస్ హైకమాండ్ మాజీ మంత్రి జానా రెడ్డికి కీలక బాధ్యతలను అప్పగించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Oct 2023 4:45 PM IST
Congress,  Jana Reddy,  key responsibilities,

జానారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ హైకమాండ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాట్లు, నేతల మధ్య సయోధ్యలో కీలక పాత్ర పోషించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ మాజీ మంత్రి జానా రెడ్డికి కీలక బాధ్యతలను అప్పగించింది. ట్రబుల్ షూటర్‌గా పేరు పొందిన ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. నలుగురు సభ్యులతో కూడిన కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు. నేతల మధ్య గొడవలు లేకుండా చేసేందుకు సీనియర్ నేత జానారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన నేతృత్వంలో ఫోర్‌మెన్ కమిటీని ఏర్పాటు చేసింది. టికెట్ దక్కని ఆశావహులు, అసంతృప్తి నేతలను బుజ్జగించే బాధ్యతలను హైకమాండ్ ఈ ఫోర్ మెన్ కమిటీకి అప్పగించింది. కమిటీలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్రావ్ ఠాక్రే, దీపా దాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించాక తలెత్తే అసంతృప్తిని పరిష్కరించడం ఈ కమిటీ ప్రాథమిక లక్ష్యం.

గాంధీభవన్‌లో జానా రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో అసంతృప్త నేతలు ఉన్న నియోజకవర్గాలపై కమిటీ చర్చించనుంది. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో తెలంగాణా కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసేందుకు రెడీ అయింది. అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపి జాబితాను ఓ కొలిక్కి తెచ్చింది. కొన్ని సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. టికెట్ కోసం ఆశావహులు ఢిల్లీతో పాటు హైదరాబాద్‌లోని గాంధీభవన్ ముందు ఆందోళనలకు దిగుతున్నారు.

Next Story