ఊపందుకున్న మునుగోడు రాజకీయం.. గడప గడపకు కాంగ్రెస్
Congress begins door-to-door campaign in Munugode.మునుగోడులో పార్టీల ప్రచారం ఊపందుకున్నాయి. ఉప ఎన్నికకు నోటిఫికేషన్
By తోట వంశీ కుమార్ Published on 2 Sept 2022 9:39 AM ISTమునుగోడులో పార్టీల ప్రచారం ఊపందుకున్నాయి. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఈ నెలాఖరులో వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటి నుంచే ఇంటింటికి ప్రచారం ప్రారంభించాలని ప్రధాన పార్టీలు బావిస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ ఓ అడుగు ముందే ఉంది. నిన్నటి నుంచే మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా గడప గడపకు కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైఫల్యాలతో పాటు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎండగడుతూ, మునుగోడులో పరిష్కారంకాని సమస్యలు వంటి అనేక అంశాలను ప్రస్తావిస్తూ 'మన మును గోడు–మన కాంగ్రెస్' పేరుతో "ఈ మోసాలను మర్చిపోవద్దు... ఈ మోసగాళ్లను విడిచి పెట్టొద్దు" అంటూ రెండు పేజీల కరపత్రాన్ని రూపొందించింది.
చౌటుప్పల్‌లో డిగ్రీ కాలేజీ, మినీ ట్యాంక్‌బండ్, మునుగోడులో జూనియర్ కాలేజీ ఏర్పాటు.. నారాయణపురంలో పోడు భూములకు పట్టాలు.. నియోజకవర్గంలోని పేదలు, విలేకరులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు.. చండూరు–నాంపల్లి రోడ్‌ను డబుల్‌రోడ్డుగా మార్చే హామీ.. ఫ్లోరోసిస్ బాధితులకు పింఛన్ వంటి స్థానిక సమస్యలను ఆ కరపత్రంలో ముద్రించారు.
ఇప్పటికే మండల వారీగా నియమించిన ఇన్‌చార్జులు గ్రామాల్లో తిరుగుతూ కాంగ్రెస్‌కు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం మునుగోడులో జరిగే కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు జానారెడ్డి, దామోదర్ రెడ్డి, మధుయాస్కీతో పాటు పలువురు నేతలు హాజరు కానున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం ఈ కార్యక్రమానికి హాజరు అవుతారని తెలిపాయి. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన హాజరు అవుతారా..? లేదా అన్న చర్చ పార్టీ నాయకుల్లో సాగుతోంది.
ఇదిలా ఉంటే.. ఆవావహులు టికెట్ దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇప్పటికే మండల వారీగా ముఖ్య నాయకులతో సమావేశమై తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలనే దానిపై ఇప్పటికే ఏఐసీసీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరో వారం లేదా పది రోజుల్లో అభ్యర్థిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.