ఏపీలో 'కండోమ్‌ పాలిటిక్స్‌'.. చీదరించుకుంటున్న ప్రజలు

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కండోమ్‌లు ఎన్నికల ప్రచార సాధనంగా మారాయి.

By అంజి  Published on  22 Feb 2024 10:27 AM IST
Condoms, party symbols, political campaign, Andhra Pradesh

ఏపీలో 'కండోమ్‌ పాలిటిక్స్‌'.. చీదరించుకుంటున్న ప్రజలు

రాజకీయాల్లో కండోమ్‌లు ఎలాంటి పాత్ర పోషిస్తాయి? ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కండోమ్‌లు ఎన్నికల ప్రచార సాధనంగా మారాయి. రెండు కీలక పార్టీలు వాటిపై ముద్రించిన తమ పార్టీ గుర్తులతో కూడిన కండోమ్‌ ప్యాకెట్లను ప్రజలకు పంపిణీ చేస్తున్నాయి. దీంతో నిరాధార ఆరోపణలు, విమర్శలు, వ్యక్తిగత దూషణలను దాటిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలు మరింత దిగజారాయని ప్రజలు అంటున్నారు.

ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీలు మరీ చీప్‌గా ప్రవర్తిస్తున్నాయి. 'భవిష్యత్తుకు గ్యారంటీ' పేరుతో టీడీపీ నేతలు, 'సిద్ధం' సభల పేరుతో వైసీపీ నాయకులు కండోమ్‌ ప్యాకెట్లు పంచుతున్నారంటూ ఎక్స్‌లో పలు పోస్టులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఇంతటి చిల్లర రాజకీయాలు అవసరమా? అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) చిహ్నాలతో కూడిన కండోమ్ ప్యాక్‌లను పార్టీ కార్యకర్తలు ఓటర్లకు పంచుతున్నారనే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సంఖ్యను ఎలా తగ్గించాలని ఓ వ్యక్తి చర్చిస్తున్నట్లు వీడియోలో ఉంది.

లోక్‌సభ ఎన్నికల కోసం ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్న పార్టీ నేతలు కండోమ్ ప్యాకెట్లను కూడా పంపిణీ చేస్తున్నట్టు వీడియోలో ఉంది. అయితే, కండోమ్‌లు పంపిణీ చేయడంపై ఇరువర్గాలు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నారు. "ఇది కండోమ్‌లతో ఆగిపోతుందా లేదా ప్రజలకు వయాగ్రా పంపిణీ చేయడం ప్రారంభిస్తారా?" అని జగన్ మోహన్ రెడ్డి పార్టీ ప్రశ్నించింది. దీనికి ప్రతిగా, టీడీపీ ఇదేనా వైఎస్‌ఆర్‌సీపీ లోగోతో కూడిన కండోమ్ ప్యాక్‌ను పోస్ట్ చేసి, 'సిద్దం' అంటే ఇదేనా అని ప్రశ్నించింది.

Next Story