మా ప్రశ్నలకు హైదరాబాద్ వేదికగా మోదీ సమాధానం చెప్పాలి: సీఎం కేసీఆర్
CM KCR Speech at Jalavihar Meeting.రాష్ట్రపతిగా మంచి వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని, ఆత్మప్రభోదానుసారం
By తోట వంశీ కుమార్ Published on 2 July 2022 2:47 PM ISTరాష్ట్రపతిగా మంచి వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని, ఆత్మప్రభోదానుసారం ఎన్నికల్లో ఓటు వేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. జలవిహార్‌లో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా శనివారం టీఆర్‌ఎస్ నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ ప్రజల తరుపున యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలుకుతున్నామన్నారు. యశ్వంత్ సిన్హా ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి. భారత రాజకీయాల్లో యశ్వంత్ సిన్హాది కీలక పాత్ర అని చెప్పారు. న్యాయవాదిగా కెరీర్‌ను ప్రారంభించారని, వివిధ హోదాల్లో దేశానికి అత్యుత్తమ సేవలందించారని తెలిపారు. ఆర్థిక మంత్రిగా పనిచేశారని, ఆయనకు అన్ని రంగాల్లో విశేష అనుభవముందన్నారు. యశ్వంత్ సిన్హా అధికారిగా, రాజనీతిజ్ఞుడిగా తనను తాను నిరూపించుకున్నారు. తన పనితీరుతో అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉంది. అందుకే.. పార్లమెంటేరియన్లంతా ఆత్మ ప్రభోదానుసారం యశ్వంత్ సిన్హాకు ఓటేయాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
ప్రధాని మోదీ ఈరోజు హైదరాబాద్ వస్తున్నారని, రెండు రోజుల పాటు ఇక్కడే ఉంటారన్నారు. మోదీ ప్రతిపక్షాలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ వేదికగా టీఆర్ఎస్ వేసే ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. మోదీ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా కూడా నెరవేర్చలేదన్నారు. టార్చిలైట్ వేసి వెతికినా ఆయన నెరవేర్చిన హామీలు ఒక్కటీ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగాయని, డీజిల్ సహా అన్ని ధరలను విపరీతంగా పెంచేశారు. ఇవి చాలదన్నట్లు నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బందిపెట్టారన్నారు. వ్యవసాయ చట్టాలపై రైతులు సుదీర్ఘ పోరాటం చేశారని, ఉద్యమంలో కొందరు రైతులు మృతిచెందారన్నారు. వారి కుటుంబాలకు తాము రూ. 3 లక్షలు ఇస్తే, బీజేపీ తమను చులకనగా చూసిందని కేసీఆర్ అన్నారు.
దేశ రైతులు బంగారం అడగడం లేదు, మద్దతు ధర అడుగుతున్నారు. ముందు ముందు ఇక మీ ఆటలు సాగవు. మోదీ కంటే ముందు చాలా మంది ప్రధానులు పనిచేశారు. ఎవరు శాశ్వతం కాదన్నారు. రైతులు, యువత, నిరుద్యోగులు మీకు ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నారా అని మండిపడ్డారు. మోదీ తనను మించిన మేధావి లేరనుకుంటున్నారని అన్నారు. బీజేపీ సమావేశాల్లో విపక్షాలపై తప్పుడు ప్రచారం చేయబోతున్నారని, తమపై చీల్చి చెండాడటానికి మోదీ రెడీ అవుతున్నారని తెలిపారు. ప్రసంగాలు కాదు.. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. దేశంలో గుణాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు.