త్వరలో కేసీఆర్ జాతీయ పార్టీ.. భారత్ రాష్ట్రీయ సమితి..?
CM KCR National party chance to announce in Delhi.ఇటీవల జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన తెలంగాణ
By తోట వంశీ కుమార్ Published on 11 Jun 2022 9:02 AM ISTఇటీవల జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన తెలంగాణ సీఎం కేసీఆర్ అందుకు అనుగుణంగా ముందుకు వెలుతున్నారు. జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ఏర్పాట్లను చేసుకుంటున్నారు. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో కొత్త పార్టీని పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నూతన పార్టీకి పేరును కూడా ఖరారు చేసినట్లు సమాచారం. 'భారత్ రాష్ట్రీయ సమితి(బీఆర్ఎస్)' పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ పేరును రిజిస్టర్ చేయించనున్నట్లు, కొత్త పార్టీని ఈ నెలాఖరులో ఢిల్లీలో కేసీఆర్ ప్రకటించే వీలుంది.
ప్రగతి భవన్‌లో శుక్రవారం సాయంత్రం పార్టీ ముఖ్యనేతలు, మంత్రులతో సీఎం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆరు గంటల పాటు ఈ భేటీ సాగింది. ఈ సమావేశంలో జాతీయ స్థాయిలో కొత్త పార్టీ ఏర్పాటు, రాష్ట్రపతి ఎన్నికలు, శాసనసభ వర్షాకాల సమావేశాలు, తాజా రాజకీయ పరిణాలపై చర్చించారు. కొత్త పార్టీకి బీఆర్ఎస్ పేరు పెట్టాలని అనుకుంటున్నట్లు ఈ భేటీలో కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నెల 19న జరిగే టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సమితి) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందాయని కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది.
ఇక.. వచ్చే నెలలో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశాల కంటే ముందే జాతీయ పార్టీని ప్రకటించాలని సీఎం భావిస్తున్నారట. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదని, బీజేపీ కి ప్రత్యామ్నాయ శక్తి ఏర్పాటు అవసరమని, అందుకే కొత్త పార్టీ ఏర్పాటుకు నిర్ణయించినట్లు సమావేశంలో నేతల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలంటే తెలంగాణ మోడల్ లో పథకాలు ఉండాలని, అందుకే కొత్త పార్టీ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు కేసీఆర్ అన్నట్లు సమాచారం.
రాష్ట్రపతి ఎన్నికల అంశంపైనా మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై దేశంలో అన్ని పార్టీలు తమతమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ దేశంలోని బీజేపీయేతర పార్టీలను కలుపుకొని ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో బీజేపీని వ్యతిరేకిస్తున్నప్రతిపక్ష పార్టీల అభ్యర్థికి మద్దతు ఇద్దామా, లేకుంటే కొత్త అభ్యర్థిని బరిలో నిలిపి దేశంలోని బీజేపీ, కాంగ్రేసేతర పార్టీల మద్దతు కూడగడదామా అనే అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.