తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. కుప్పం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోసం తాను కుప్పం రాకున్నా.. తనని ఏడు సార్లు ప్రజలు గెలిపించారన్నారు. వాళ్లతో తనది భావోద్వేగపూరిత అనుబంధమన్నారు. ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే.. జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. జగన్ విధ్వంసకారి అని.. కక్ష, కార్ఫణ్యాలు బెదిరింపులతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
వైకాపా పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఆ పార్టీ కార్యకర్తలు కూడా బాధపడే పరిస్థితులు ఉన్నాయన్నారు. పొత్తులపై వైసీపీ నేతలు పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. గత ఎన్నిక ఫలితాలకు పొత్తులకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. పొత్తులు పెట్టుకున్నప్పుడు గెలిచిన, ఓడిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. పొత్తులు లేకుండా కూడా గెలిచినట్లు తెలిపారు. పొత్తులు అనేవి రాష్ట్రంలోని పరిస్థితులపై ఆధారపడి ఉంటాయన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి దృష్ట్యా అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఓట్లేయాలనుకుంటే అన్నీ జరుగుతాయని చంద్రబాబు అన్నారు.