క‌ర‌క‌ట్ట ఉండ‌డంతోనే భ‌ద్రాచ‌లం ప‌ట్ట‌ణ‌మంతా సుర‌క్షితంగా ఉంది : చంద్ర‌బాబు

Chandrababu examined Bhadrachalam Karakatta.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ స‌రిహ‌ద్దుల్లోని విలీన మండ‌లాల్లోని వ‌ర‌ద ప్ర‌భావిత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 July 2022 7:29 AM GMT
క‌ర‌క‌ట్ట ఉండ‌డంతోనే భ‌ద్రాచ‌లం ప‌ట్ట‌ణ‌మంతా సుర‌క్షితంగా ఉంది : చంద్ర‌బాబు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ స‌రిహ‌ద్దుల్లోని విలీన మండ‌లాల్లోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. గురువారం రాత్రి భ‌ద్రాచ‌లంలో బ‌స చేసిన చంద్రబాబు శుక్ర‌వారం ఉద‌యం భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. భద్రాద్రి రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు చంద్రబాబుకు వేదాశీర్వచనం చేసి స్వామివారి జ్ఞాపిక, స్వామి వారి లడ్డు ప్రసాదాలను అంద‌జేశారు. అంత‌క‌ముందు ఆలయ అర్చకులు, ఆలయ ఈఓ శివాజీ ఆలయ మర్యాదలతో చంద్ర‌బాబుకు స్వాగతం పలికారు.


అనంత‌రం భ‌ద్రాచ‌లం క‌ర‌క‌ట్ట,స్నాన ఘ‌ట్టాలను చంద్ర‌బాబు ప‌రిశీలించారు. వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై స్థానికుల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. భ‌ద్రాచ‌లంలో వ‌ర‌ద ముప్పు నుంచి ప్ర‌జ‌ల్ని కాపాడేందుకు టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో 20 ఏళ్ల క్రితం(2002లో) క‌ర‌క‌ట్టను నిర్మించిన‌ట్లు తెలిపారు. దాని వ‌ల్లే ప‌ట్ట‌ణ‌మంతా సుర‌క్షితంగా ఉంద‌న్నారు. ఇటీవ‌ల భారీగా వ‌ర‌ద వ‌చ్చినా క‌ర‌క‌ట్ట ఉండ‌డంతోనే భ‌ద్రాచ‌లం ప్ర‌జ‌లంతా ధైర్యంగా నిద్ర‌పోగ‌లిగార‌న్నారు. వ‌ర‌ద క‌ర‌క‌ట్ట పై వ‌ర‌కు వ‌చ్చింద‌ని, దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకుని ప‌నులు చేప‌ట్టాల‌న్నారు. ప‌క్క‌నే ఉన్న ఐదు ముంపు గ్రామాల‌కు ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌కుండా శాశ్వ‌తంగా ప‌రిష్కారం చూపాల‌న్నారు.

అనంత‌రం వీలీన గ్రామాల్లో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. ఎట‌పాక‌, పీచుక‌ల‌పాడు, క‌న్నాయిగూడెం, గుండాల‌, పురుషోత్త‌ప‌ట్నం గ్రామాల్లోని బాధితుల‌ను ఆయ‌న క‌లుసుకుంటున్నారు. "గోదావరి ముంపు ప్రాంతమైన కూనవరం మండల కేంద్రంలో ఇళ్ల పరిస్థితి ఇది. గ్రామంలో ఓ బాధితుడు తన ఇంటిని స్వయంగా కుటుంబ సభ్యులతో కలిసి శుభ్రం చేసుకుంటున్నారు. మోకాలి వరకు పేరుకు పోయిన బురదలో ముక్కుపచ్చలారని చిన్నారులు పడుతున్న కష్టం చూస్తే బాధేస్తోంది. వరదొచ్చి పది రోజులు దాటుతున్నా ముంపు గ్రామాల్లో ప్రతి చోటా ఇదే పరిస్థితి.ఇదేనా బాధితులను ఆదుకునే తీరు?ఆ చిన్నారిని అడిగితే మీ ప్రభుత్వానికి నిజమైన మార్కులు వేస్తుంది.ఎవరు ఏ వరదలో ఏమై పోతే మనకేంటి అనుకుంటున్నారా? పరదాలు కట్టి పలకరింపులు కాదు..వాస్తవాలు తెలుసుకోండి..సాయం చేయాల‌ని" చంద్ర‌బాబు అన్నారు.


Next Story