బీజేపీ కార్యవర్గ సమావేశాలకు టీఆర్‌ఎస్ ఆటంకాలు: కిషన్ రెడ్డి
Central Minister Kishan Reddy fires on TRS govt.తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఎన్ని అడ్డంకులు సృష్టించినా
By తోట వంశీ కుమార్ Published on 1 July 2022 8:05 AM GMTతెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేసి తీరుతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జులై 3న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ జరగనుంది. ఈ సభా ఏర్పాట్లను శుక్రవారం రాజ్యసభ సభ్యులు లక్షణ్‌తో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజల ఆశీస్సులతో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను విజయవంతం చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. కార్యవర్గ సమావేశాలు ప్రజల కార్యక్రమంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలందరూ నరేంద్ర మోదీ పర్యటన కోసం ఎదురుచూస్తున్నారన్నారు. రాష్ట్రానికి ఒకేసారి 18 మంది సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలంతా రావడం అరుదైన దృశ్యమని కిషన్‌రెడ్డి అన్నారు. ఎనిమిదేళ్లలో మోదీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు.
మూడు రోజులపాటు హైదరాబాద్ నగరంలో అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయని అయితే.. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఈ కార్యక్రమాలకు అనేక అవరోధాలను సృష్టిస్తోందన్నారు. అయినప్పటికీ ఈ కార్యక్రమాలను విజయవంతం చేసి తీరుతామన్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి టీఆర్ఎస్ హార్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంపై ప్రధాని మోదీ, నడ్డా, అమిత్ షాలు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా మోదీ సభ ఉంటోందన్నారు. మరో ఏడాదిలో తెలంగాణలో రామ రాజ్యం రావటం ఖాయమని లక్ష్మణ్ అన్నారు.