జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు..!

Central Government prepares for Jamili Elections.జ‌మిలి ఎన్నిక‌ల‌పై కేంద్రం దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Dec 2021 9:43 AM IST
జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు..!

జ‌మిలి ఎన్నిక‌ల‌పై కేంద్రం దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాల్లో వేగం పుంజుకుంది. జ‌మిలి ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ప‌లు ఆటంకాలు ఉన్నాయి. ఈ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా ఎన్నిక‌ల సంఘంతో పాటు కేంద్రం వేస్తున్న అడుగులే ఇందుకు నిద‌ర్శ‌నం. ఇక జ‌మిలి ఎన్నిక‌ల‌పై కేంద్రం త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న చేయ‌నుంది. ఈ క్ర‌మంలో దేశవ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అంతా సజావుగా ఎన్నిక‌లు జరిగేలా కేంద్ర ఎన్నికల సంఘం సంస్కరణలు చేపడుతోంది.

జమిలి ఎన్నికల పై ఇప్పటికే ప్రధాని న‌రేంద్ర మోదీతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా పలు సంకేతాలు ఇచ్చింది. జ‌మిలి ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న‌పై స‌రైన స‌మ‌యం కోసం ఓ వైపు వేచిచూస్తూనే.. మరోవైపు అన్ని ఏర్పాట్లను ఎన్నికల సంఘంతో పాటు కేంద్రం కూడా పూర్తి చేస్తోంది. తాజాగా కేంద్రం ప్రకటించిన కొన్ని సంస్కరణలతో పాటు ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలు చూస్తుంటే జమిలి ఎన్నికలు మరెంతో దూరంలో లేవని స్పష్టమవుతోంది.

ఎన్నికల సంఘం జమిలి ఎన్నికల నిర్వహణ కోసం రూట్ మ్యాప్ సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగా ఓటర్ల నమోదు ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు ఆధార్ తో ఓటరు కార్డు లింక్ చేయడం వంటి సంస్కరణల ద్వారా దేశంలో మెజారిటీ జనాభాను ఓట్ల ప్రక్రియలో భాగస్వాముల్ని చేసేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది. వీటికి కేంద్రం కూడా తాజాగా ఆమోదముద్ర వేసింది. అలాగే పార్లమెంటు సమావేశాల్లో ఎన్నికల సంస్కరణలపై బిల్లు పెట్టేందుకు కూడా కేంద్రం సిద్ధమవుతోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్కో ఎన్నిక‌ల‌కు ఒక్కో ఒట‌రు జాబితాల్ని రూపొందిస్తుండ‌గా.. అన్ని ఎన్నిక‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే విధంగా ఒకే ఓట‌రు జాబితా సిద్దం చేయాల‌ని ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. కేంద్రం తాజాగా ఆమోదించిన ఎన్నికల సంస్కరణలతో ఇలా ఒకే ఓటరు జాబితా తయారు చేసేందుకు వీలు కలగనుంది. ముఖ్యంగా ఏడాదికి నాలుగుసార్లు ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించ‌డంతో ఒకే ఓటర్ల జాబితా రూపకల్పనకు వీలు కలుగుతుందని భావిస్తున్నారు.

ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తమ చట్టాల‌ను సవరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘాలు ప్రతీ ఏటా జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే.. తాజా ఓటర్ల జాబితాను అనుసరించగలిగితే చాలా సమస్యలు దూరమవుతాయని ఈసీ భావిస్తోంది. ఇప్పటికే 25 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఈసీ రూపొందించిన ఉమ్మడి ఓటర్ల జాబితాను స్ధానిక ఎన్నికలకు వాడుతున్నాయి. మిగతా రాష్ట్రాల్ని కూడా ఈ జాబితాను వాడాల‌ని కోరుతోంది. అంతిమంగా ఒకే ఓటరు జాబితా దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చేస్తే.. ఇక జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అవుతుంది. ఈ నేప‌థ్యంలోనే మిగతా రాష్ట్రాలపై ఒత్తిడి పెంచేందుకు పార్లమెటులో త్వరలో ఓ బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

Next Story