మూడు నెలల్లో ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక వస్తుంది: కేటీఆర్

ఇటీవల ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ బీఆర్ఎస్‌కు షాక్‌ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  26 March 2024 10:28 AM GMT
brs,  ktr,  khairatabad, mla danam nagender,

మూడు నెలల్లో ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక వస్తుంది: కేటీఆర్ 

ఇటీవల ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ బీఆర్ఎస్‌కు షాక్‌ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన పార్టీ మారడంపై బీఆర్ఎస్ అధిష్టానం, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పార్టీ మారిన దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలంటూ అసెంబ్లీ స్పీకర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సహా ఇతర నాయకులంతా దానం నాగేందర్‌ చేసిన పనిపై మండిపడుతున్నారు. బీఆర్ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి.. కాంగ్రెస్‌లో ఎలా చేరతారని ప్రశ్నిస్తున్నారు. ఇది అతన్ని గెలిపించిన ప్రజలను మోసం చేసినట్లే అని మండిపడుతున్నారు.

తాజాగా ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. మూడు నెలల్లోనే ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక రాబోతుందని కేటీఆర్ అన్నారు. ప్రజలను మోసం చేసిన వ్యక్తి దానం నాగేందర్‌ అని చెప్పారు. అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా అనర్హుడు అని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై అవసరమైతే సుప్రీంకోర్టుకు అయినా సరే వెళ్లేందుకు రెడీగా ఉన్నామని అన్నారు. దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించే వరకు చట్టపరంగా ముందుకు వెళ్తామని చెప్పారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రావడం.. ఉండటం ముఖ్యం కాదని అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా వెంటే ఉంటేనే నిజమైన నాయకుడు అవుతాడని చెప్పారు. ఓటు వేసిన ప్రజలు, వెనకాలే ఉండి గెలిపించిన కార్యకర్తలను దానం నాగేందర్ వెన్నుపోటు పొడిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

Next Story