పఠాన్‌చెరులో బీఆర్ఎస్‌కు షాక్.. పార్టీకి నీలం మధు రాజీనామా
ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్ ఎదురైంది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు నీలం మధు ప్రకటించారు.
By Srikanth Gundamalla Published on 16 Oct 2023 6:16 AM GMTపఠాన్‌చెరులో బీఆర్ఎస్‌కు షాక్.. పార్టీకి నీలం మధు రాజీనామా
ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్ ఎదురైంది. అసంతృప్తులను బుజ్జగించి పార్టీలోనే కొనసాగేలా చూడాలని భావించినా.. వారు మాత్రం వరుసగా షాక్‌లు ఇస్తూనే ఉన్నారు. టికెట్ దక్కని వారు పార్టీకి రాజీనామా చేస్తూనే ఉన్నారు. తాజాగా పఠాన్‌చెరుకు చెందిన బీఆర్ఎస్ నేత నీలం మధు బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. చివరి క్షణం వరకు వేచి చూసిన అతను పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి సీఎం కేసీఆర్ ఆదివారం బీఫామ్ అందజేయడంతో నీలం మధు పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపారు.
సోమవారం ఉదయం ఆయన స్వగ్రామం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో మధు రాజీనామా ప్రకటన చేశారు. అయితే తాను ఎన్నికల బరిలో ఉన్నట్లు నీలం మధు ప్రకటించారు. సొంత గ్రామమైన కొత్తపల్లి గ్రామం నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 2001లో టీఆర్ఎస్‌లో చేరిన నీలం మధు.. 2014లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో చిట్కూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. కాగా బీఆర్ఎస్లో ముదిరాజ్ లకు సముచితం దక్కడంలేదని నేతలు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే.. తనకు ప్రకటించే విషయంలో బీఆర్ఎస్ అధిష్టానానికి అక్టోబర్ 16 వరకు గతంలో డెడ్‌లైన్ విధించారు నీలం మధు. కానీ.. పార్టీ ఆయన డిమాండ్‌ను పెద్దగా పట్టించుకోలేదు. దాంతో.. పార్టరీ నాయకత్వం పట్టించుకోకపోతే పార్టీని వీడుతానని.. పఠాన్‌చెరు నుంచే ఎన్నికల బరిలోకి దిగుతానని ప్రకటించారు. చివరకు పార్టీ పట్టించుకోకపోవడంతో నీలం మధు బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఈ మేరకు ఎన్నికల బరిలోకి దిగుతానని ప్రకటించారు. పఠాన్‌చెరులో అహంకారం కావాలా.. ఆత్మగౌరవం కావాలో ప్రజలు తేల్చుకోవాలని చెప్పారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల మనిషిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.