కేటీఆర్ సయోధ్య.. కడియం శ్రీహరికి మద్దతు తెలిపిన రాజయ్య

మంత్రి కేటీఆర్ చొరవతో ఎమ్మెల్యే రాజయ్య స్టేషన్‌ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరికి మద్దతు ఇస్తానని ప్రకటించారు.

By Srikanth Gundamalla  Published on  22 Sep 2023 9:00 AM GMT
BRS, Telangana, Minister KTR, MLA Rajaiah, kadiyam Srihari,

కేటీఆర్ సయోధ్య.. కడియం శ్రీహరికి మద్దతు తెలిపిన రాజయ్య

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ 95 శాతం అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి దాదాపుగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే అవకాశం కల్పించారు. అయితే.. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రమే కేసీఆర్ మరోసారి టికెట్‌ ఇవ్వలేదు. దాంతో.. వారు అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేశారు. వారిలో ఒకరు స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఆయన పార్టీ మారతారని వార్తలు వినిపించాయి.

స్టేషన్‌ ఘన్‌పూర్‌ టికెట్‌ ఈసారి కడియం శ్రీహరికి టికెట్‌ ఖరారు చేయడంతో తాటికొండ రాజయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదనడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు నుంచే కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య వార్‌ కొనసాగుతూ ఉంది. తనని కాదని కడియంకు టికెట్‌ ఇవ్వడంతో అసహనానికి గురయ్యాడు రాజయ్య. పరోక్షంగా శ్రీహరిని ఓడిస్తా అనే రేంజ్‌ వరకు వెళ్లారు. దాంతో.. పార్టీ మారతారనే ప్రచారం కూడా జరిగింది. తాటికొండ రాజయ్యను బుజ్జగించేందుకు మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. శుక్రవారం ప్రగతిభవన్‌కు కడియం శ్రీహరి, రాజయ్యను ఇద్దరినీ పిలిపించి సమావేశం అయ్యారు. మంత్రి కేటీఆర్ జరిపిన మంతనాలతో ఎట్టకేలకు రాజయ్య శాంతించారు. పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని చెప్పారు. కడియం శ్రీహరిని గెలిపించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.

మంత్రి కేటీఆర్ రాజయ్యకు కీలక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలో మరిన్ని అవకాశాలు ఉంటాయని.. తాను కూడా రాజయ్యకు అండగా ఉంటానని కేటీఆర్ చెప్పారని సమాచారం. పార్టీలో రాజయ్యకు సముచిత స్థానం కల్పిస్తానని కేటీఆర్ తెలిపారు. రాజయ్య భవిష్యత్‌కు సీఎం కేసీఆర్, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మంత్రి కేటీఆర్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన భరోసాతోనే రాజయ్య శాంతించారు. ఆ తర్వాత స్టేషన్ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి గెలుపునకు కృషి చేస్తానని చెప్పారు. మొత్తం మీద కేటీఆర్ చొరవ తీసుకుని రాజయ్యకు నచ్చజెప్పడంతో స్టేషన్‌ ఘన్‌పూర్‌లో కడియం, రాజయ్య మధ్య వివాదానికి తెరపడినట్లు అయ్యింది.

Next Story