బీఆర్ఎస్‌కు బిగ్‌ షాక్.. కాంగ్రెస్‌లోకి కేశవరావు.. డేట్‌ ఫిక్స్?

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

By Srikanth Gundamalla
Published on : 28 March 2024 5:38 PM IST

brs, mp keshava rao, hyderabad mayor, gadwal vijaya lakshmi, congress,

బీఆర్ఎస్‌కు బిగ్‌ షాక్.. కాంగ్రెస్‌లోకి కేశవరావు.. డేట్‌ ఫిక్స్?

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు నాయకులు తమ సొంత పార్టీలకు షాక్‌లు ఇస్తూ.. ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇటీవల బీఆర్ఎస్‌ నేతలు వరుసగా ఆ పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్‌ గేట్లు ఎత్తితే బీఆర్ఎస్‌లో మిగిలేది కేసీఆర్ కుటుంబమే అంటూ సీఎం రేవంత్‌రెడ్డి కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్‌ అగ్రనేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ పలువురు బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఇంకా కాంగ్రెస్‌ లో చేరేందుకు క్యూ కడుతూనే ఉన్నారు.

పార్టీ జనరల్‌ సెక్రటరీ, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు త్వరలోనే బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. కేశవరావుతో పాటు ఆయన కూతురు, హైదరాబాద్‌ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధం అయినట్లు సమాచారం. కేకేతో పాటు ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మితో ఏఐసీసీ ఇంచార్జ్‌ దీపా దాస్‌ మున్షీ భేటీ అయిటనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వారిద్దరినీ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారట. వారు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత తెలిపినట్లు సమాచారం. దాంతో.. దీనికి సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియా, రాజకీయ వర్గాల్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. అంతే కాదు.. తాను పార్టీ వీడబోతున్న విషయాన్ని కేసీఆర్‌ను కలిసి చెప్పేందుకు కేకే వెళ్లారని కూడా సమాచారం.

కేశవరావుకి బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్టీలో సముచిత స్థానం కల్పించారు. ఎంపీ సీటు ఇవ్వడంతో పాటు పార్టీ నిర్ణయాలు తీసుకోవడంలో కేకేకు ప్రాధాన్యత ఇచ్చారు. కేసీఆర్‌కు పెద్దన్నలా ఉంటూ.. పార్టీ వేసే అడుగుల్లో కేశవరావు తనదైన పాత్ర పోషించారు. అయితే.. అలాంటి సీనియర్ నేత పార్టీని వీడటం ఇప్పుడు బీఆర్ఎస్‌కు పెద్ద దెబ్బే అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌లో కేశవరావు, ఆయన కూతురు విజయలక్ష్మి చేరిక కన్ఫమ్‌ అయ్యిందనే వార్తలూ వినిపిస్తున్నాయి. ఇందుకు డేట్‌ కూడా ఫిక్స్‌ అయ్యిందనీ.. ఈనెల 30న కాంగ్రెస్‌లో చేరతారని సమాచారం. అయితే.. ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు. నిజం ఎంత ఉన్నదానే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Next Story