24 గంటల్లో చేసిన ఆరోపణలను నిరూపించాలి: అర్వింద్‌కు కవిత సవాల్

నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్‌ విసిరారు.

By Srikanth Gundamalla  Published on  21 July 2023 8:43 AM GMT
BRS, MLC Kavitha, BJP, MP Arvind,

 24 గంటల్లో చేసిన ఆరోపణలను నిరూపించాలి: అర్వింద్‌కు కవిత సవాల్

నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్‌ విసిరారు. తనపై చేసిన అవినీతి ఆరోపణలను అర్వింద్‌ నిరూపించాలని అన్నారు. 24 గంటల సమయం ఇస్తున్నానని.. ఆలోపు నిరూపించలేకపోతే అర్వింద్‌ ముక్కు నేలకు రాయాలని అన్నారు ఎమ్మెల్సీ కవిత.

బీఆర్‌ఎస్‌ పార్టలో ఉన్నవి అన్నీ సింహాలే అన్నారు ఎమ్మెల్సీ కవిత. కానీ కొన్ని పార్టీల్లో మాత్రం గ్రామ సింహాలు ఉన్నాయని విమర్శించారు. బాల్కొండలో ఎంపీ అర్వింద్ అసభ్యంగా మాట్లాడారని కవిత ఫైర్ అయ్యారు. తాను నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో రెండు కేంద్రీయ విద్యాలయాలు తెచ్చానని చెప్పారు. ఎంపీగా ఉన్న సమయంలోనే స్పైస్‌ బోర్డు తెచ్చానని గుర్తు చేశారు. కానీ.. ఎంపీ అర్వింద్‌ ఇది తానే చేసినట్లుగా చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు..తన భర్తపై కూడా అర్వింద్‌ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తన భర్త పేరుని తీసుకురావాల్సిన అవసరం ఏం ఉందంటూ అర్వింద్‌ను ప్రశ్నించారు. తాను, నాన్న, అన్నా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి.. ఏదైనా అంటే సహించాం.. కానీ రాజకీయాల్లో లేని వారి గురించి మాట్లాడటం సబబు కాదని అన్నారు. ఇప్పటి వరకు తనపై అర్వింద్‌ చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. అందుకు అర్వింద్‌కు 24 గంటల సమయం ఇస్తున్నానని.. ఇచ్చిన సమయంలో చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే అర్వింద్‌ ముక్కు నేలకు రాయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

బీజేపీ ఎంపీగా అర్వింద్ ఇన్నాళ్లు నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయని అర్వింద్‌కు ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారని అన్నారు. ఈ రెండు పార్టీల పాలనలో ఎంతో అవినీతి జరిగిందని ఆరోపించారు. తెలంగాణకు శ్రీరామ రక్ష అంటే బీఆర్ఎస్‌ అని.. ప్రజల మద్దతు కేసీఆర్‌కు ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దీమా వ్యక్తం చేశారు.

Next Story