జనవరి 3 నుంచి బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారం కోల్పోయిన పార్టీ బీఆర్ఎస్.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అవుతోంది.
By Srikanth Gundamalla
జనవరి 3 నుంచి బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారం కోల్పోయిన పార్టీ బీఆర్ఎస్.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అవుతోంది. ఈక్రమంలోనే జనవరి 3వ తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించనుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేకే, మధుసూదనాచారి, హరీశ్‌రావు, కడియం, పోచారం, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డితో పాటు పలువురు ముఖ్యనేతలు ఈ సమావేశాలను నిర్వమించనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ సమావేశాలు రెండు విడుతలుగా జరగనున్నాయి. మొదటి విడత జనవరి 3వ తేదీ నుంచి జనవరి 12 వరకు తెలంగాణ భవన్‌లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరగుతాయి. ఇక సంక్రాంతి పండగ తర్వాత మిగిలిన నియోజకవర్గాల సమావేశాలను కొనసాగించనుంది.
జనవరి 3న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంతో ప్రారంభం కానున్నాయి. 4వ తేదీన కరీంనగర్, 5న చేవెళ్ల, జనవరి 6న పెద్దపల్లి, 7వ తేదీన నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10వ తేదీన వరంగల్, 11వ తేదీన మహబూబాబాద్, జనవరి 12న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలు జరుగుతాయి. ఆ తర్వాత సంక్రాంతి పండగ సందర్భంగా మూడ్రోజుల పాటు సమావేశాలకు విరామం ఉంటుంది. తిరిగి సంక్రాంతి తర్వాత జనవరి 16న నల్లగొండ, 17వ తేదీన నాగర్‌కర్నూలు, 18వ తేదీన మహబూబ్‌నగర్, 19వ తేదీన మెదక్ పార్లమెంటరీ, 20న మల్కాజ్‌గిరి, జనవరి 21న చివరగా సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ సమీక్షలు నిర్వహించనుంది.
ఈ సమావేశాలు ఆయా పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలను అందరినీ పార్టీ అధిష్టానం ఆహ్వానించనుంది. ఎంపీలు, నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు ఇలా అందరినీ భాగస్వామ్యం చేసుకుని పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధం కానుంది. ప్రధానంగా తెలంగాణ భవన్‌లో జరిగే ఈ సమావేశాల్లో పార్లమెంట్‌లో మెజార్టీ సీట్లలో ఎలా విజయం సాధించాలనే దానిపై చర్చించనున్నారు. ముఖ్యనేతల అభిప్రాయాలను తీసుకుని పటిష్టమైన కార్యాచరణను రూపొందించనుంది బీఆర్ఎస్ అధిష్టానం. ఈ సమీక్షల తర్వాత ప్రజాక్షేత్రంలో ప్రచారపర్వం కూడా బలంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఆలోచనలు చేస్తోంది.