నేను బీఆర్ఎస్‌ను వీడే ప్రసక్తే లేదు: మల్లారెడ్డి

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

By Srikanth Gundamalla  Published on  8 March 2024 10:46 AM GMT
brs, malla reddy, meet, kcr, telangana politics ,

నేను బీఆర్ఎస్‌ను వీడే ప్రసక్తే లేదు: మల్లారెడ్డి

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు నాయకులు పార్టీలు మారుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్య నేతలను కాపాడుకునేందుకు ఆయా పార్టీలు రంగంలోకి దిగాయి. ఒకవైపు ఎన్నికలకు సన్నద్ధం అవుతూనే.. పార్టీ సభ్యులను కాపాడుకునే పనిలో పడ్డాయి. కొద్ది రోజులుగా బీఆర్ఎస్ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆ పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్ పిలిపించి మాట్లాడారు.

మేడ్చల్ ఎమ్మెల్యే శుక్రవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డిని కేసీఆర్‌ పిలిపించి ఆయనతో మాట్లాడారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్‌ అభ్యర్థిగా తన కుమారుడు బరిలోకి దిగుతారనే ప్రచారం జరిగింది. కేసీఆర్‌తో సమావేశంలో ఈ విషయంపైనా చర్చించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌ ఎంపీ టికెట్‌ తమ కుటుంబ సభ్యులకు వద్దని కేసీఆర్‌తో మల్లారెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం.

ఇక పార్టీ మార్పు విషయంపైనా మల్లారెడ్డితో కేసీఆర్ మాట్లాడారని సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోను తాను బీఆర్ఎస్‌ను వీడబోయేది లేదని మల్లారెడ్డి స్పష్టం చేశారట. కేసీఆర్‌తోనే నడుస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో.. మల్లారెడ్డి పార్టీ మారుతనే ప్రచారానికి తెరపడినట్లు అయ్యింది. సీఎం రేవంత్ స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డిని క‌ల‌వ‌డంపై కూడా మ‌ల్లారెడ్డి వివ‌ర‌ణ ఇచ్చారు. తన అల్లుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డికి చెందిన కాలేజీ భ‌వ‌నాల కూల్చివేత అంశంపై చర్చించినట్లు సమాచారం.

Next Story