గోదావరిలో కాంగ్రెస్ కుట్రలు కొట్టుకుపోయాయి: కేటీఆర్

తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  20 July 2024 12:55 PM GMT
brs, ktr, tweet,  keleshwaram, congress govt ,

గోదావరిలో కాంగ్రెస్ కుట్రలు కొట్టుకుపోయాయి: కేటీఆర్

తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో.. వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఒక పోస్టుపెట్టారు. ఎక్స్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో నిండుకుని ఉన్న ఫోటోను షేర్ చేశారు.

ఉదృతంగా ప్రవహిస్తోన్న గోదావరి నదిలో కాంగ్రెస్ కుట్రలు కొట్టుకుపోయాయని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు వచ్చాయనీ.. ప్రాజెక్టు సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు భారీ వర్షాలు పడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో కళకళలాడుతోందిన చెప్పారు. పోటెత్తిన వరదకు దుష్టశక్తుల, పన్నాగాలు పటాపంచలయ్యాయని అన్నారు. కేసీఆర్ గారి సమున్నత సంకల్పం జై కొడుతోంది.. జల హారతి పడుతోందని పేర్కొన్నారు.

లక్షల క్యూసెక్కుల గంగా ప్రవాహంలో లక్షకోట్లు వృథా చేశారనే విమర్శలు గల్లంతయ్యాయన్నారు కేటీఆర్. మేడిగడ్డ బ్యారేజీ మాత్రం.. మొక్కవోని దీక్షతో నిలబడిందన్నారు. కొండంత బలాన్ని చాటిచెబుతోందని పేర్కొన్నారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా దశాబ్దాలుగా దగాపడ్డ ఈ తెలంగాణ నేలకు.. ఇప్పటికీ.. ఎప్పటికీ మేడిగడ్డే మన రైతుల కష్టాలు తీర్చే 'మేటి'గడ్డ అని కేటీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరమే కరువును పారదోలే 'కల్పతరువు' అన్నారు. బురద రాజకీయాలను భూస్థాపితం చేసిన మానవ నిర్మిత అద్భుతానికి, నిర్మించిన కేసీఆర్ కు తెలంగాణ సమాజం పక్షాన మరోసారి సెల్యూట్ అని కేటీఆర్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.

Next Story