మంత్రి శ్రీధర్‌బాబుకు సహవాస దోషం అంటుకున్నట్లుంది: కేటీఆర్
మంత్రి శ్రీధర్‌బాబు పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 30 Sep 2024 11:31 AM GMTమంత్రి శ్రీధర్‌బాబు పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. మంత్రి శ్రీధర్ బాబు బాగా చదువుకున్న వ్యక్తి అనీ.. సంస్కారం ఉన్నవ్యక్తి అని అన్నారు. దాంతో..ఆయనకు గౌరవం ఉండేదన్నారు. కానీ.. శ్రీధర్ బాబుకి సహవాస దోషం అంటుకున్నట్లుగా ఉందని కేటీఆర్ విమర్శించారు. ఓటుకు నోటు దొంగలతో కూర్చొని శ్రీధర్ బాబు కూడా చెడిపోయారని అన్నారు. అందుకే సంస్కారవంతుడైన శ్రీధర్ బాబు కూడా నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారనీ.. వారి పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మూసీ బాధితులు ఏడుస్తుంటే కాంగ్రెస్ నేతలు ఇష్టారీతిన విమర్శలు చేయడం ఏంటని అన్నారు. రూ.50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవిని అమ్ముకోవడం, రూ.500 కోట్లకు సీఎం పదవిని అమ్ముకోవడం, మంత్రులు ఒక్కొక్కరు పర్సెంటేజీలు పంచుకొని... ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేయడం కాంగ్రెస్ లో ఉన్నవారికే సాధ్యం అవుతుందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నాయకులకు ఉన్న దిక్కుమాలిన అలవాట్లు రాష్ట్ర ప్రజలకు ఉండవని వ్యాఖ్యానించారు కేటీఆర్.
ఇళ్లను కోల్పోయిన బాధితులు, మహిళలు ఏడుస్తుంటే శ్రీధర్ బాబు మాట్లాడిన తీరు సరికాదన్నారు. ప్రజల ఆత్మగౌరవం మీద కాంగ్రెస్ దెబ్బ కొడుతోందనీ.. అలా చేస్తే ప్రజలు ఊరుకోరు అన్నారు. తిరగబడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిక్కులే ఎదురవుతాయని అన్నారు. ప్రస్తుతం శ్రీధర్ బాబు మాటలు చేస్తుంటే ఆయనపై ఉన్న గౌరవం పోతుందని కేటీఆర్ అన్నారు. రూ.5వేల కోసం బూతులు తిడుతున్నారని మాట్లాడటం సరికాదని అన్నారు. ఇళ్లను కూలగొడితే ఎవరైనా సరే తిడతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.