కడియం శ్రీహరి వెళ్లాక పార్టీలో జోష్ కనిపిస్తోంది: హరీశ్‌రావు

హన్మకొండలో బీఆర్ఎస్‌ లోక్‌సభ నియోజకవర్గ విస్తృతస్తాయి సమావేశం నిర్వహించారు.

By Srikanth Gundamalla  Published on  1 April 2024 3:30 PM IST
brs, harish rao, comments,  kadiyam, congress government,

కడియం శ్రీహరి వెళ్లాక పార్టీలో జోష్ కనిపిస్తోంది: హరీశ్‌రావు 

హన్మకొండలో బీఆర్ఎస్‌ లోక్‌సభ నియోజకవర్గ విస్తృతస్తాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల పార్టీకి గుడ్‌బై చెప్పిన కడియం శ్రీహరి గురించి మాట్లాడారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు.

కడియం శ్రీహరి పార్టీ నుంచి వెళ్లిపోయాక ఇక్కడ క్యాడర్‌లో జోష్‌ కనిపిస్తోందని హరీశ్‌రావు అన్నారు. పదవులను, కూతురికి టికెట్‌ను తీసుకుని పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి కడియం అంటూ హరీశ్‌రావు మండిపడ్డారు. అతనికి మంచి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత కార్యకర్తలదే అటూ కడియం శ్రీహరి కామెంట్స్ చేశారు. పార్టీ మారేదే లేదు అంటూ ముందు చెప్పి ఆ తర్వాత ఎందుకు గుడ్‌బై చెప్పారని ప్రశ్నించారు. కడియం శ్రీహరికి నైతిక విలువలు ఉంటే బీఆర్ఎస్‌ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. దొంగలతో కండువా కప్పించుకునే స్థాయికి కడియం శ్రీహరికి అవసరమా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోతున్నాయి.. అలాంటి పార్టీకి శ్రీహరి వెళ్లాడని వ్యాఖ్యానించారు. ఇక బీఆర్ఎస్‌లో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని చెప్పారు. ద్రోహం చేసినవారిని మళ్లీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని హరీశ్‌రావు తెగేసి చెప్పారు.

మన పార్టీకి కష్టాలు కొత్త కాదని హరీశ్‌రావు అన్నారు. కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దనీ.. రేవంత్‌ నాయకులను కొనగలడు కానీ.. ఉద్యమ నాయకులను కొనలేడని హరీశ్‌రావు అన్నారు. నిరుద్యోగులకు రూ.4వేల భృతి ఇస్తామని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు లోక్‌సభ ఎన్నికల ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. రైతు ఉసురు పోసుకున్న పార్టీ బీజేపీ అనీ.. అలాంటి పార్టీ కూడా ఓట్లు అడిగేందుకు వస్తోందనీ చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూనే ఉన్నారీ.. దేశంలో నిరుద్యోగం, పేదరికం, ఆకలి పెరుగుతున్నాయని చెప్పారు హరీశ్‌రావు. కానీ.. సీబీఐ, ఈడీ కేసులు మాత్రం పెరిగిపోతున్నాయని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఒకటే అని.. వింటే జోడీ లేదంటే ఈడీ అన్నట్లు వేధింపులకు గురిచేస్తున్నారి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు.

Next Story