కాంగ్రెస్ సభ హిట్.. కానీ ఆ వీడియోతో
ఖమ్మంలో కాంగ్రెస్ సభ హిట్ అని చెబుతున్నారు. అయితే ఈ సభలో తోపులాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 July 2023 3:08 PM ISTకాంగ్రెస్ సభ హిట్.. కానీ ఆ వీడియోతో
ఖమ్మంలో కాంగ్రెస్ సభ హిట్ అని చెబుతున్నారు. అయితే ఈ సభలో తోపులాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించాలని ఒకరినొకరు తోసుకోవడం వీడియోలో రికార్డు అయింది. వేదికపై కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన తోపులాట.. ఆ పార్టీలో అంతర్గత పోరుకు సాక్ష్యమంటూ భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ పథకం ఆవిష్కరణ సందర్భంగా కాంగ్రెస్ నేత కోమట్టిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్కను వేదికపైన నెట్టేసారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పక్కనే ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క దాదాపుగా పడిపోబోయారు.
ఎడిట్ చేసిన వీడియో: కాంగ్రెస్
నేతల మధ్య తోపులాట లాంటిది జరగలేదని కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్‌ఎస్, బీజేపీ ఆరోపణలను కొట్టిపారేశారు. “యూట్యూబ్ వీడియో చూడండి, కోమటిరెడ్డిని నెట్టడం కారణంగా ఆయన భట్టి మీద పడ్డారు. వేదికపై చాలా మంది నాయకులు ఉన్నారు. వారంతా ఫోటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు.. ఒకే ఫ్రేమ్ లో కనిపించాలని ముందుకు రావడానికి ఒకరినొకరు నెట్టుకోవడం గమనించవచ్చు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినది కాదు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో పూర్తి వీడియో కాదు' అని పార్టీ సీనియర్ సభ్యుడు తెలిపారు. భట్టిని తోసేసిన కోమటిరెడ్డి తనను వెనుక నుంచి తోసేసిన పార్టీ కార్యకర్తపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం సభ ముగిశాక ఈ ఘటన జరిగింది. ఈ సభకు 3 లక్షల మంది తరలివచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మొదటి వాగ్దానం చేసిన తొలి బహిరంగ సభ ఇదే. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఆ వీడియోను వాడుకుంటున్న బీఆర్‌ఎస్, బీజేపీ:
కోమటిరెడ్డి భట్టిని నెట్టివేస్తున్న వీడియో అంటూ బీఆర్‌ఎస్, బీజేపీ డిజిటల్ మీడియా విభాగం ఈ వీడియోను వైరల్ చేస్తోంది. కాంగ్రెస్‌లో అంతర్గత పోరుకు ఈ వీడియో నిదర్శనమని చెబుతూ వస్తున్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఆరోపణలపై స్పందించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు నిరాకరించారు. ఇదొక అనవసరమైన వివాదమని అన్నారు. ఆ పార్టీ నేతలు ఇలాంటి వీడియోలను తమకు నచ్చినట్లుగా చెలామణి చేయగలరని అన్నారు.
చేయూత పథకం
చేయూత పథకంలో భాగంగా రూ.4000 పింఛను అందజేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, బీడీ, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు ఈ పథకం ద్వారా డబ్బు అందజేస్తామన్నారు. బీఆర్‌ఎస్ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. "ఇటీవల కర్ణాటకలో ఎన్నికలు జరిగాయి, అక్కడ రాహుల్‌గాంధీ రూ.4000 పింఛను ఎందుకు ప్రకటించలేదు. అసలు ఈ పింఛన్ గురించి రాహుల్ గాంధీకి తెలుసా? తెలంగాణకు వచ్చి ఆ పార్టీ నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు. రాష్ట్రం గురించి ఏ మాత్రం అవగాహన, జ్ఞానం రాహుల్ కు లేదు." అంటూ విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 88 సీట్లు గెలిచి రాష్ట్రానికి రెండోసారి సీఎం అయిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. రాహుల్‌గాంధీ పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన వ్యక్తి అని విమర్శించారు. సీఎం కేసీఆర్ రాచరికపోకడను ప్రదర్శిస్తున్నారంటూ రాహుల్ చేసిన విమర్శలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. రాచరిక పోకడ రాహుల్ దేనని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఏ హాదా ఉందని ప్రజలకు హామీలు ఇస్తున్నారని రాహుల్ ను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు రాసిచ్చిన స్ర్క్రిప్ట్ చదివితే ఇలాగే ఉంటుందని విమర్శించారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని, భారత దేశంలో అవినీతిని మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారని అన్నారు.
రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ నేతలు కలిసి పనిచేశారని తమ వద్ద ఆధారాలు ఉన్నాయని బీఆర్‌ఎస్ నేతలు అన్నారు. వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈటల రాజేంద్ర, రేవంత్ రెడ్డి కలిసి హోటల్ లో ఉన్న ఫొటోలు మా వద్ద ఉన్నాయని, ఈ రెండు పార్టీలు కలిసి బీఆర్ ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని అన్నారు.