తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలల్లో కమలహాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కమలహాసన్ కోయంబత్తూర్ నుంచి పోటీ చేశారు. కమల్ హాసన్ పోటీ చేస్తున్న కోయంబత్తూర్ దక్షిణ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ లోపలికి కమల్ వెళ్లగా, ఆయన కూతురు, హీరోయిన్ శ్రుతిహాసన్ కూడా ఆయన వెనకే వెళ్లడం వివాదాస్పదమవుతోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా శ్రుతిహాసన్ ప్రవర్తించిందని ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మక్కల్ నీది మయ్యం పార్టీలో శ్రుతికి ఎలాంటి పదవీ లేదు.
అయినప్పటికీ ఆమెను పోలింగ్ బూత్ లోకి ఎలా అనుమతించారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రుతిహాసన్ ఓటు వేసి ఇంటికెళ్లి 'మక్కల్ నీది మయ్యంకు ఓటు వేయాలని ట్వీట్ చేసిందని.. ఇది కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని బీజేపీ నేతలు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. కుమార్తెలు అక్షర, శ్రుతిహాసన్‌లతో కలిసి మంగళవారం ఉదయాన్నే మైలాపూర్‌లో ఓటు హక్కును కమల్ వినియోగించుకున్నారు. ఈ ముగ్గురు క్యూలో నిలబడి ఓటు వేశారు. అనంతరం తాను పోటీచేస్తున్న కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గంలో పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విమానంలో కుమార్తెలతో పాటు కమల్ వెళ్లారు. పలు పోలింగ్ కేంద్రాల్ని సందర్శించారు.
మరో వైపు భారతీయ జనతా పార్టీ నాయకులు ఓటర్లను మభ్య పెట్టాలని ప్రయత్నించారని కమల్ హాసన్ ఆరోపించారు. ఓటుకు నోటు, టోకెన్ల పంపిణీ అంటూ ఓటర్లను మభ్య పెట్టే ప్రయత్నాలు తీవ్రంగానే జరిగాయని, రీపోలింగ్ కోరుతామని కమల్ తెలిపారు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో నోట్లు, టోకెన్లు జోరుగానే పంపిణీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు పంపిణీ చేశారో ఆధారాలు సహా తన వద్ద ఉన్నాయని, ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. రీపోలింగ్‌కు పట్టుబడుతామని, ఒక్క కోవై దక్షిణంలోనే కాదు, రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గాల్లో ఇలాగే జరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.