రెండు రోజుల్లో సీట్ల పంపకాలపై క్లారిటీ: పురందేశ్వరి
ఏపీలో ఎన్నికల సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 10 March 2024 6:54 AM GMTరెండు రోజుల్లో సీట్ల పంపకాలపై క్లారిటీ: పురందేశ్వరి
ఏపీలో ఎన్నికల సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారం కోసం రాజకీయ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ-టీడీపీ, జనసేన మధ్య కొద్దిరోజులుగా జరుగుతున్న చర్చలు సఫలం అయ్యాయి. బీజేపీతో పొత్తు కుదిరినట్లు ప్రకటించాయి టీడీపీ, జనసేన పార్టీలు. అయితే.. సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు తెలిపాయి. సీట్ల పంపకాలపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పార్టీ ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ పొత్తుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మేనిఫెస్టో రూపకల్పన కోసం అభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు ఆమె చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏం ఆశిస్తున్నారనే అంశంపై రెండు బాక్సలును ఏర్పాట్లు చేస్తామని ఆమె వెల్లడించారు. తొమ్మిది జిల్లాలకు మేనిఫెస్టో రథాలను పంపనున్నట్లు పురందేశ్వరి చెప్పారు. ఇక పొత్తులపై ఇప్పటికే బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని అన్నారు.
టీడీపీ-జనసేన పార్టీలతో పొత్తు ఖరారు అవ్వడం సంతోషంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ఇక ఇప్పుడు సీట్ల పంపకాలపై చర్చలు కొనసాగుతున్నాయని ఆమె చెప్పారు. ఏయే సీటే.. ఎన్ని సీట్లు అనేది రెండ్రోజుల్లోనే క్లారిటీ వచ్చేస్తుందని చెప్పారు. ఈ పొత్తు దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ కోసమే అని చెప్పారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు అన్నింటినీ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రాములవారికి ఉడుత సాయం కూడా అవసరం అయ్యిందనీ.. ఏపీలో అరాచక పాలన అంతానికి అందరూ కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పురందేశ్వరి వ్యాఖ్యానించారు.