బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు వార్తలపై లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో బీఆర్‌ఎస్‌తో బీజేపీ పొత్తు ఉంటుందనే వార్తలపై ఎంపీ లక్ష్మణ్ కీలక కామెంట్స్ చేశారు.

By Srikanth Gundamalla  Published on  19 Feb 2024 8:15 AM GMT
bjp, laxman, comments,  alliance,  brs,

బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు వార్తలపై లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు 

ఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఈ సందర్భంగా తెలంగాణలో బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు ఉంటుందనీ.. లోక్‌సభ ఎన్నికల్లో కలిసి బరిలోకి దిగుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో.. ఈ విషయంపై ఎంపీ లక్ష్మణ్ క్లారిటీ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని వెల్లడించారు. బీఆర్ఎస్‌ పార్టీ కాళ్ల బేరానికి వచ్చినా కూడా వారితో పొత్తు పెట్టుకోమని క్లారిటీ ఇచ్చారు. అయితే.. ఈ విషయాన్ని తాను పార్లమెంటరీ బోర్డు సభ్యుడి హోదాలో చెబుతున్నట్లు ఎంపీ లక్ష్మణ్ అన్నారు.

తెలంగాణలో ఉన్న 17 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని లక్ష్మన్ చెప్పారు. బీఆర్ఎస్‌ ఒక మునిగిపోయిన నావా అనీ విమర్శలు చేశారు. అలాంటి పార్టీతో తాము పొత్తు పెట్టుకునే అవకాశమే లేదన్నారు. అయితే.. బీఆర్ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీలే తమతో టచ్‌లో ఉన్నారనీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ రహస్య ఒప్పందం చేసుకున్నాయని ఎంపీ లక్ష్మణ్ ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్‌ గతంలో అవినీతి పాల్పడిందని కాంగ్రెస్‌ చెబుతోంది కానీ.. చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇక ఆంధ్రప్రదేవ్‌లో పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్పారు.

సోమవారం హైదరాబాద్‌లోని పాతబస్తీలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ విజయ సంకల్ప యాత్రలు మంగళవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో పూజలు నిర్వహించారు. యాత్ర రథాలను స్వయంగా కిషన్‌రెడ్డి నడిపారు. అయితే.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుందని అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు సాధిస్తామని అన్నారు. అలాగే.. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు విజయ సంకల్ప యాత్రలు కొనసాగుతాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.

Next Story