కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ధోరణి బయటపడింది: కిషన్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on  11 Jan 2024 1:15 PM GMT
bjp, kishan reddy, comments,  congress, ayodhya,

కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ధోరణి బయటపడింది: కిషన్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య ఆహ్వానాన్ని కాంగ్రెస్‌ తిరస్కరించడం ఏమాత్రం సరికాదని అన్నారు. ఓటు బ్యాంకు పాలిటిక్స్‌లో భాగంగానే కాంగ్రెస్‌ ఇలా వ్యవహరిస్తోందని విమర్శించారు. జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగుతోందని.. ఈ కార్యక్రమం కోసం యావత్‌ దేశం మొత్తం ఆతృతగా ఎదురు చూస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

ఈ సందర్బంగా.. మీడియా సమావేశంలో మాట్లాడిన కిషన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీపై ధ్వజమెత్తారు. బహిష్కరించడం కాంగ్రెస్‌కు అలవాటైందని వ్యాఖ్యానించారు. అయోధ్య కేసు విచారణ సమయంలో కూడా కాంగ్రెస్‌ వితండవాదం చేస్తూనే వచ్చిందన్నారు. 50 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ ఇప్పుడు అభద్రతా భావంలో ఉందన్నారు. హిందువులకు సంబంధించి ప్రతి అంశాన్ని కాంగ్రెస్‌ రాజకీయం చేస్తోందనీ.. కాంగ్రెస్‌ హిందూ వ్యతిరేక ధోరణి తాజాగా మరోసారి బయటపడిందన్నారు. కాంగ్రెస్‌కు భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలపై ఏమాత్రం గౌరవం లేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. విదేశాల నుంచిదిగుమతి చేసుకున్న నాయకత్వంతో భారత సంప్రదాయాలకు కాంగ్రెస్‌ వ్యతిరేకంగా మాట్లాడుతోందన్నారు.

అయోధ్య రామాలయ అక్షితలు పంపిణీ చేస్తుంటే.. సికింద్రాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేయడం ఏంటని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఏంటన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఈ విషయంలో ఎందుకు భిన్నంగా స్పందింస్తోందని నిలదీశారు. రాజకీయాలకు అతీతంగా అయోధ్య రామాలయ ట్రస్ట్‌ అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానిస్తోందనీ.. కానీ కాంగ్రెస్‌ వ్యవహరం మాత్రం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కిషన్‌రెడ్డి అన్నారు.

Next Story