మునుగోడు ఉప ఎన్నిక.. బీజేపీ వ్యూహాం అదేనా..?
BJP Gears Munugode bypoll Ground Strategy.పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో బీజేపీ తమ వ్యూహాలకు పదునుపెట్టింది
By తోట వంశీ కుమార్ Published on 11 Oct 2022 3:15 AM GMTఇప్పుడు అందరి దృష్టి మునుగోడు ఉప ఎన్నిక పైనే ఉంది. నోటిఫికేషన్ వెలువడడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ ఉప ఎన్నికలో ప్రధానంగా టీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ(బీజేపీ), కాంగ్రెస్ ల మధ్యే పోరు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కొక్కరుగా నామినేషన్లు వేస్తున్నారు. సోమవారం బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పలువురు బీజేపీ నేతలు పిలుపునిచ్చారు.
ఇక పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో బీజేపీ తమ వ్యూహాలకు పదునుపెట్టింది. యాక్షన్ ప్లాన్ అమలుకు రంగం సిద్దం చేస్తోంది. బహుముఖ వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరును ఒకటికి మూడు నాలుగు సార్లు కలిసి బీజేపీ ఓటేసేలా ఒప్పించడం, టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టడం, బీజేపీ గెలిస్తే చేసే పనుల గురించి వివరించడం, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రచారం వంటి వ్యూహాలతో ముందుకు వెలుతోంది.
16 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలతో ఉప ఎన్నికల స్టీరింగ్ కమిటీని నియమించడంతో పాటు 7 మండలాలు, 2 మున్సిపాలిటీలకు కలిపి 27 మంది మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే వీరంతా మునుగోడు చేరుకుని ప్రచారం చేస్తుండగా..వారం, పది రోజుల్లో రెండో విడత బృందాలు మునుగోడుకు చేరుకుని ప్రచారాన్ని ఉధృతం చేయనున్నాయి.
ఇదిలా ఉంటే.. ప్రచారం పర్వం ముగింపు నాటికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాగాతోని కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో గానీ బహిరంగ సభ నిర్వహించడానికి ప్రణాళికలు రచిస్తోంది. అప్పటి వరకు పలువురు కేంద్ర మంత్రులు కార్యవర్గ సభ్యులు ముమ్మరంగా ప్రచారం చేయనున్నారు.
బీజేపీ గెలుపు ఖాయం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీలో లేరంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంట కలిపే విధంగా తెలంగాణ పేరును కూడా తీసేశారన్నారు. సీఎం కేసీఆర్ అహంకారాన్ని దెబ్బతీయడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన హుజురాబాద్, దుబ్బాకలో ప్రజలు బీజేపీని ఆశీర్వదించారని, మునుగోడులో ఎంత డబ్బు, మద్యం పంచినా ఇక్కడి ప్రజలు బీజేపీనే గెలిపిస్తారని.. బీజేపీ గెలుపు ఖాయమన్నారు.