తక్కువ టైమ్‌లో సీఎం రేవంత్ ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారు: ఈటల
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయని ఈటల రాజేందర్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 16 May 2024 4:24 PM ISTతక్కువ టైమ్‌లో సీఎం రేవంత్ ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారు: ఈటల
తెలంగాణలో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ముగియగా.. ఇటీవలే రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. ఇక ఫలితాలను ఎన్నికల సంఘం అధికారులు జూన్ 4వ తేదీన వెల్లడించనున్నారు. రాష్ట్రంలో త్వరలోనే వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా గజ్జుల ప్రేమేందర్ రెడ్డిని పార్టీ బరిలోకి దింపింది.
ప్రేమేందర్ రెడ్డి తరఫున బీజేపీ నాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా కేంద్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాగా.. లోక్‌సభ ఎన్నికల్లో ఈటల రాజేందర్ బీజేపీ తరఫున మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయని ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు సంతోషంగా లేరన్నారు. అతి తక్కువ సమయంలోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న సీఎంగా రేవంత్ రెడ్డి నిలిచారంటూ ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం పైనుంచి పొయ్యిలో పడినట్లు అయ్యిందన్నారు. కేసీఆర్‌పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టే.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు వేశారని చెప్పారు. కానీ.. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే అద్వాన్నంగా ఉందని ప్రజలకు త్వరగా అర్థమైందన్నారు. కాంగ్రెస్ నేతల అవినీతికి, దందాలకు రాష్ట్రంలో అడ్డూఅదుపు లేకుండా పోయిందని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఎప్పుడో విశ్వాసం కోల్పోయారని బీజేపీ నేత ఈటల రాజేందర్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఉన్న ప్రేమేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఎప్పటికైనా ప్రజల తరఫున పోరాడేది బీజేపీ మాత్రమే అన్నారు. ప్రశ్నించే గొంతు లేకుండా అధికార పక్షానిదే ఏకపక్షం అవుతుందని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.