బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. 'కొత్త సచివాలయం డోమ్‌లు కూల్చేస్తాం'
Bandi sanjay shocking comments on Telangana New Secretariat.తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. తాము అధికారంలోకి వచ్చిన
By తోట వంశీ కుమార్ Published on 10 Feb 2023 1:09 PM ISTతెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన సచివాలయం డోమ్‌లను కూల్చివేస్తామంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత మోడల్ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా మారుస్తామంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్‌ను కూడా ప్రజా దర్భార్‌గా మారుస్తామని అన్నారు.
రోడ్డుపక్కన ఉన్న గుడులు, మసీదులు కూల్చుతామని కేటీఆర్ అంటున్నారు. ఆయనకు దమ్ముంటే.. రహదారులకు విస్తరణకు అడ్డుగా ఉన్న ప్రార్థనాలయాల కూల్చివేతను పాతబస్తీ నుంచి ప్రారంభించాలని సవాల్ విసిరారు. ఎంఐఎం, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని అన్నారు. అందుకే తాజ్ మహల్ కన్నా అద్భుతంగా కొత్త సచివాలయం కట్టారని అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ ను ప్రశంసిస్తున్నారని, అసద్ కళ్లలో ఆనందం చూడ్డానికే కేసీఆర్ తాజ్ మహల్ నమూనాలో సచివాలయన్ని కట్టారన్నారు.
సీఎం అవినీతి, కుటుంబ పాలనపై ప్రజలోకి కార్నర్ మీటింగ్ ల ద్వారా తీసుకెళ్తామన్నారు. ప్రస్తుతం ప్రజలను పట్టించుకునే పరిస్థితిలో కేసీఆర్ లేరన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లించడం లేదన్నారు. తెలంగాణకు 60 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుందని, ఇప్పటి వరకు హైదరాబాద్‌ను ఏ మేరకు అభివృద్ధి చేశారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
కాగా.. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. 17న పరేడ్ గ్రౌండ్‌లో బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. పలువురు జాతీయ స్థాయి నాయకులు ఈ సభకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.