బండి సంజయ్‌కి కీలక బాధ్యతలు అప్పగించిన బీజేపీ అధిష్టానం
బీజేపీ జాతీయ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బండి సంజయ్‌కి జాతీయ నాయకత్వంలో బాధ్యతలను అప్పగించింది.
By Srikanth Gundamalla
బండి సంజయ్‌కి కీలక బాధ్యతలు అప్పగించిన బీజేపీ అధిష్టానం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ని తొలగించి.. కిషన్‌రెడ్డికి ఆ బాధ్యతలను అప్పగించారు. అంతేకాదు.. పలువురు నాయకులకు కీలక పదవులు అప్పగించారు. అయితే.. రాష్ట్రంలో బీజేపీకి మంచి జోష్ తీసుకొచ్చిన బండి సంజయ్‌ని అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించడంతో పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బండి సంజయ్‌కి జాతీయ నాయకత్వంలో బాధ్యతలను అప్పగించింది.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌ని నియమించింది అధిష్టానం. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ జాతీయ కమిటీని ప్రకటించారు. ఇదే సమయంలో తెలంగాణ నుంచి డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఏపీ నుంచి సత్యకుమార్ బీజేపీ జాతీయ కార్యదర్శిగా కొనసాగనున్నారు. అంతేకాదు.. ఏదైనా ఒక రాష్ట్రానికి బండి సంజయ్‌ని ఇంచార్జ్‌గా నియమించే అవకాశాలు ఉన్నాట్లు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తీసేసిన తర్వాత.. ఆయనకు ఏ బాధ్యతలు అప్పజెప్తారా అని ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఆయన ఫాలోవర్స్, పార్టీ కార్యకర్తలు అంతా సంతృప్తి చెందేలా బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని తొలగించి.. ఆ బాధ్యతలను కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి అప్పగించిన విషయం తెలిసిందే.