వైసీపీకి షాక్‌... కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే ఆర్థర్

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

By Srikanth Gundamalla  Published on  19 March 2024 2:45 PM IST
andhra pradesh, ycp, mla arthur,  congress,

 వైసీపీకి షాక్‌... కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే ఆర్థర్ 

లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీకి ఊహించని షాక్‌ ఎదురైంది. కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్‌ పార్టీకి గుడ్‌బై చెప్పాడు. కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మంగళవారం ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు ఎమ్మెల్యే ఆర్థర్.

ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల ఎమ్మెల్యే ఆర్థర్‌కు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అయితే.. నందికొట్కూరు నుంచి ఈసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆర్థర్ భావించారు. కానీ.. ఆయనకు వైసీపీ తరఫున టికెట్‌ లభించలేదు. ఆర్థర్‌ను కాదని వైసీపీ అధిష్టానం సుధీర్‌కు నందికొట్కూరు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చింది. దాంతో ఆర్థర్ పార్టీపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వైసీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. మరోవైపు గత ఎన్నికల్లో ఆర్థర్ గెలుపు కోసం ఎంతో కృషి చేసిన బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి ఇప్పుడు రివర్స్ అయినట్లు తెలుస్తోంది. దాంతో.. ఆర్థర్‌కు టికెట్‌ కేటాయించొద్దని ఒకట్రెండు రోజులు వైసీపీ అధిష్టానం వద్ద తిష్ట వేసి మరీ చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదీ ఏమైనా చివరకు నందికొట్కూరు టికెట్‌ లభించకపోవడంతో ఆర్థర్‌ వైసీపీకి గుడ్‌బై చెప్పారు.

కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే ఆర్థర్‌ నందికొట్కూరు నుంచే పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25న కాంగ్రెస్‌ జాబితా విడుదల కాబోతుంది. ఈ జాబితాలో కచ్చితంగా ఆర్థర్‌ పేరు ఉంటుందనీ.. నందికొట్కూరు నుంచి టికెట్ కేటాయిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు అన్ని చర్చల తర్వాతే ఆర్థర్ కాంగ్రెస్‌లో చేరారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


Next Story