చంద్రబాబుని ఓడిస్తేనే టీడీపీ జూ.ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్తుంది: కొడాలి నాని

వైసీపీ మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ నాయకులు, ఆ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు.

By Srikanth Gundamalla  Published on  6 March 2024 12:40 PM IST
andhra pradesh, ycp, kodali nani,  chandrababu, ntr,

చంద్రబాబుని ఓడిస్తేనే టీడీపీ జూ.ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్తుంది: కొడాలి నాని

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు నేతలు పార్టీలు మారుతూనే ఉన్నారు. ఇంకా కొందరు ముఖ్య నేతలు ఎలాగైనా తమ పార్టీని ఎన్నికల్లో గెలిపించాలని ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థి పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ నాయకులు, ఆ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు. జూనియర్‌ ఎన్టీఆర్ ప్రస్తావన తెస్తూ చంద్రబాబుపై మండిపడ్డారు.

రాబోయే ఎన్నికల్లో టీడీపీని గొయ్యి తీసి పాతి పెట్టాలని కొడాలి నాని అన్నారు. అలా చేస్తేనే టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్తుందని చెప్పారు. గతంలో పెద్ద ఎన్టీఆర్‌ను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. ఆయన్ని అప్పుడు అనాథను చేశారని మండిపడ్డారు. ఇప్పుడు చంద్రబాబుని మరోసారి గెలిపిస్తే ఈసారి జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఒంటరిని చేస్తారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. 2009 ఎన్నికల్లో జూ. ఎన్టీఆర్‌ను చంద్రబాబు తిప్పుకుని యాక్సిడెంట్‌ అయితే ప్రాణం పోగొట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు తుప్పు అయితే.. అయన కుమారుడు లోకేశ్ పప్పు అంటూ విమర్శలు చేశారు. లోకేశ్‌కు ఏమీ తెలియదనీ.. పుట్టిన రోజుకు, చావుకి తేడా తెలియదంటూ విమర్శించారు. లోకేశ్‌ను తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు కొడాలి నాని అన్నారు. టీడీపీకి అధ్యక్షుడిని చేసి ఆ తర్వాత ఎన్టీఆర్‌ను ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్‌ ఎన్టీఆర్‌ను అభిమానించే వాళ్లంతా చంద్రబాబుని ఓడించాలని కొడాలి నాని పిలుపునిచ్చారు. ఒకవేళ చంద్రబాబు గెలిస్తే జూనియర్‌ ఎన్టీఆర్‌ను కూడా అనాథను చేస్తారని కొడాలి నాని వ్యాఖ్యానించారు.


Next Story