ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది: మాజీ సీఎం జగన్
ఏపీ కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్ర విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 10 Aug 2024 4:00 PM GMTఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది: మాజీ సీఎం జగన్
ఏపీ కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్ర విమర్శలు చేశారు. హామీల గురించి ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా జగన్ సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సూపర్ టెన్ అంటూ హామీలు గుప్పించిన చంద్రబాబు.. ఇప్పుడు అప్పులు, వడ్డీలు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆరోపించారు.
ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టిన జగన్.. 'ఎన్నికలప్పుడు రాష్ట్రం బాధ్యత నాది చెప్పారు. పైపెచ్చు రాష్ట్రానికి రూ.14లక్షల కోట్ల అప్పులున్నాయని, అయినా సంపద సృష్టిస్తానని అన్నారు. హామీలకు గ్యారెంటీ నాదే అని పదేపదే చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్రం బాధ్యత ప్రజలదంటూ నైజాన్ని బయటపెట్టారు. ఇచ్చిన హామీలనుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చిమోసం కాదా? ప్రమాణస్వీకారం చేసిన తొలి క్షణం నుంచే మీరు ప్లేటు ఫిరాయించారు. అప్పులకు వడ్డీలు కట్టాలి, అవి కట్టడానికే డబ్బుల్లేవు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ లేని అప్పులు ఉన్నట్టుగా, వాటికి లేని వడ్డీలు కడుతున్నట్టుగా పదేపదే మాట్లాడి ప్రజలను మాయచేసే ప్రయత్నం చేస్తున్నారు." అంటూ జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
తల్లికి వందనం కింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇవ్వలేదని చెప్పారు జగన్. రైతు భరోసా కింద ప్రతి రైతుకు రావాల్సిన రూ.20 వేలు రాలేదని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు పెండింగ్ పెట్టారని.. వసతి దీవెన, సున్నావడ్డీ లేనే లేదని విమర్శించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలా నెలా ఇస్తామన్న రూ.1500 జాడే లేదన్నారు. రేషన్ నిలిచిపోయింది. వాలంటీర్లను మోసం చేశారు, విత్తనాల కోసం రైతులు క్యూలో నిలబడే పరిస్థితి ఉందని జగన్ చెప్పారు. సూపర్ సిక్స్, సూపర్ టెన్ అంటూ ఎన్నికల సమయంలో చాలా వాగ్ధానాలు చేశారని.. అధికారంలోకి వచ్చాక రూ.10 లక్షల కోట్ల అప్పులంటున్నారని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. ఇకనైనా అబద్ధపు లెక్కలతో మోసం చేయడం మానీ.. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
.@ncbn … ఎన్నికలప్పుడు ఈ రాష్ట్రం బాధ్యత నాది అన్నారు. పైపెచ్చు రాష్ట్రానికి రూ.14లక్షల కోట్ల అప్పులున్నాయని, అయినా సంపద సృష్టిస్తానని, హామీలకు గ్యారెంటీ నాదే అని పదేపదే చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్రం బాధ్యత ప్రజలదంటూ నైజాన్ని బయటపెట్టారు. ఇచ్చిన హామీలనుంచి…
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 10, 2024