సైకో పాలన పోతే తప్ప భవిష్యత్ ఉండదు: చంద్రబాబు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి.
By Srikanth Gundamalla
సైకో పాలన పోతే తప్ప భవిష్యత్ ఉండదు: చంద్రబాబు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఎలాగైనా మరోసారి అధికారం చేపట్టాలని అధికార పార్టీ వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇక వైసీపీని గద్దె దించాలని టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తున్న విషయం తెలిసిందే. దాంతో.. అధికార, విపక్ష పార్టీల మధ్య రోజూ మాటల యుద్ధం నడుస్తోంది. మూడు పార్టీల అధినేతలు ఇప్పటికే ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఇక తాజాగా చంద్రబాబు అనకాపల్లి జిల్లా మాడుగలలో 'రా.. కదలి రా' సభలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు 'రా.. కదలి రా' పేరుతో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన విషయం తెలిసిందే. ఈ పేరుతో రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లా మాడుగలలో నిర్వహించారు. ఈమేరకు సభలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బటన్ నొక్కి సీఎం జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. బటన్ నొక్కుడు కాదు.. నీ బొక్కుడు సంగతేంటని సీఎం జగన్‌ను నేరుగా ప్రశ్నించారు చంద్రబాబు. సీఎం జగన్ వల్లే రాష్ట్రంలో చెతపన్ను వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రానున్న ఎన్నికలకు ఏపీ భవిష్యత్ కోసమని అన్నారు చంద్రబాబు. 64 రోజుల్లో ఏపీలో తమ ప్రభుత్వం వస్తుందని దీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం... ప్రజలు గెలవాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న సైకో పాలనను అంతం చేస్తే తప్ప ఏపీకి భవిష్యత్ ఉండదని అన్నారు. జగన్ వంటి సీఎంను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అన్నారు. ప్రజలపై భారం వేసి పట్టిపీడిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కరెంటు చార్జీలను పెంచి ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. కరెంటు చార్జీల ద్వారా ప్రజలపై రూ.64వేల కోట్ల భారం మోపారన్నారు. నిరుద్యోగులను పట్టించుకోలేదని ఆరోపించారు. జగన్‌ది ఉత్తుత్తి బటన్ అని గమనించాలని కోరారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో యువతకు జాబ్ రావాలంటే బాబు రావాలని పిలుపునిచ్చారు.