వైసీపీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే
లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 24 March 2024 4:29 PM ISTవైసీపీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే
లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు దాదాపుగా అభ్యర్థులను ప్రకటించేశాయి. అయితే.. టికెట్ దక్కని కొందరు నాయకులు తమ పార్టీలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు సర్దుకుని ముందుకు పోతుంటే.. ఇంకొందరు నేతలు మాత్రం మరో పార్టీలో చేరుతున్నారు. ఎలాగైనా ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని టికెట్ ఇచ్చే పార్టీ కండువా కప్పుకుంటున్నారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైసీపీకి మరోసారి షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీ వీడగా.. తాజాగా మరో ఎమ్మెల్యే వైసీపీకి గుడ్‌బై చెప్పాడు. ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఆదివారం వైసీపీని వీడారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు షర్మిల ఎలీజాకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎలీజాకు వైసీపీ నుంచి టికెట్ దక్కలేదు. దాంతో.. ఆయన కొంతకాలంగా వైసీపీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. చింతలపూడి నుంచి ఎలీజాను కాదని.. కంభం విజయరాజుకు టికెట్ ఇచ్చారు పార్టీ అధినేత, సీఎం జగన్. దాంతో ఎలీజా వైసీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. కాగా.. ఇవాళ ఉందయం తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.