ఏపీకి తెలంగాణ రూ.5,170 కోట్లు ఇవ్వాల్సి ఉంది: మంత్రి నారాయణ

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యాయి. కానీ.. కొన్ని విభజన సమస్యలు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి.

By Srikanth Gundamalla  Published on  30 Jun 2024 7:30 AM GMT
andhra pradesh,  minister narayana,  telangana,

ఏపీకి తెలంగాణ రూ.5,170 కోట్లు ఇవ్వాల్సి ఉంది: మంత్రి నారాయణ 

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యాయి. కానీ.. కొన్ని విభజన సమస్యలు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి. మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాలు రెండింటికీ హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉండేది. కానీ.. భాగ్యనగరం ఇప్పటి నుంచి పూర్తిగా తెలంగాణకు రాజధాని మాత్రమే. వాస్తవానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన మొదట్లోనే అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. రాజధాని అంశం పక్కకు పెడితే.. రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు మరికొన్ని ఉన్నాయి. తెలంగాణ నుంచి ఏపీకి భారీగా నిధులు రావాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు.

ఏపీ హౌసింగ్ బోర్డు లెక్కల ప్రకారం తెలంగాణ నుంచి ఏపీకి సుమారు రూ.5170 కోట్లు రావాల్సి ఉందని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తులకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టులో కేసులు ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలనీ.. దీని కోసం చర్యలు తీసుకోవాలంటూ మంత్రి నారాయణ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.వేల కోట్ల ఆస్తులు ఉన్న సంస్థల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా వివాదం కొనసాగతూనే ఉందని చెప్పారు. ముఖ్యంగా 9,10 షెడ్యూళ్లలో ఉన్న సంస్థల విషయంలో విభజన సమస్యలు ఓ పట్టాన కొలిక్కి రావడం లేదని మంత్రి నారాయణ చెప్పారు.

రెండు రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదకన ఆస్తులు, అప్పులు పంపిణీ చేసుకోవాల్సి ఉంఉందని రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉందని మంత్రి నారాయణ అన్నారు. కానీ విభజన తర్వాత ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు అక్కడికే చెందాలని అప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు త్వరగా పరిష్కారం అవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు అధికారులకు పలు సూచనలు చేశారు మంత్రి నారాయణ.

Next Story