అందుకే చంద్రబాబు మరోసారి బీజేపీతో కలిశారు: అమిత్‌షా
సీట్ల సర్దుబాబు కూడా ఇప్పటికే ముగిసిందని అమిత్‌షా పేర్కొన్నారు.
By Srikanth Gundamalla Published on 16 March 2024 2:24 AM GMTఅందుకే చంద్రబాబు మరోసారి బీజేపీతో కలిశారు: అమిత్‌షా
శనివారం మధ్యాహ్నం ఎన్నికల నగరా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. అంతేకాదు.. ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకసారి జరుగుతున్నాయి. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కుదరడంతో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. గతంలో ఎన్డీఏతో కలిసి ఉన్న టీడీపీ వారితో తెగదెంపులు చేసుకుంది. కానీ.. తాజాగా మరోసారి జతకట్టింది. ఇదే విషయంపై కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ నేత అమిత్‌షా మాట్లాడారు. ఓ వేడుకలో పాల్గొన్నా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఎందుకు ముందుకు వెళ్లాలని కమలదళం నిర్ణయం తీసుకుందని అడిగిన ప్రశ్నకు అమిత్‌షా సమాధానం చెప్పారు. 2024 ఏపీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్లు చెప్పారు. సీట్ల సర్దుబాబు కూడా ఇప్పటికే ముగిసిందని అమిత్‌షా పేర్కొన్నారు. ఎన్డీఏను వదిలేయాలని తాము చంద్రబాబుతో ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఆయనే నిర్ణయం తీసుకుని బయటకు వెళ్లారని చెప్పారు. ప్రజల్లోకి వెళ్లి, ఎన్నికల్లో ఓడిపోయారని అన్నారు. ఇక ఆ విషయం గ్రహించిన చంద్రబాబు మళ్లీ బీజేపీతో కలిశారని వ్యాఖ్యానించారు. ఇక తాము కూడా చంద్రబాబుకి స్వాగతం పలికినట్లు చెప్పారు అమిత్‌షా.
ఇక ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ వైసీపీ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి సానుకూలంగానే ఉంటుంది. గతంలో పలుమార్లు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దుగా ఓటింగ్ వేసిన విషయం కూడా తెలిసిందే. జగన్‌ను కాకుండా చంద్రబాబుతోనే కలవడానికి గల కారణాలను కూడా అమిత్‌షా చెప్పారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని చంద్రబాబు దీమాగా ఉన్నారని అమిత్‌షా అన్నారు. ఆరేళ్ల తర్వాత కూటమిలో చేరారని.. తాము కూడా ఈ కూటమి ఏపీలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నమ్ముతున్నట్లు అమిత్‌షా వెల్లడించారు.
ఇక ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేస్తుంది. పవన్ కళ్యాణ్ పార్టీకి 21 సీట్లు కేటాయించగా.. బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇక మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గాను టీడీపీ 17, జనసేన 6, బీజేపీకి ఆరు స్థానాల్లో బరిలోకి దిగుతున్నాయి.