పిల్ల కాలువలు ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందే: షర్మిల
ఇచ్చిన హామీలను.. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టిన జగన్ ఇక అధికారంలోకి రారు అంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.
By Srikanth Gundamalla Published on 14 Aug 2024 9:00 PM ISTపిల్ల కాలువలు ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందే: షర్మిల
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా రాజకీయాలపై స్పందించారు. వైఎస్ జగన్ మరోసారి అధికారంలోకి రారు అని జోస్యం చెప్పారు. జగన్‌కు ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తే.. దాన్ని నిలుపుకోలేకపోయారని అన్నారు. ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్, పోలవరంతో సహా విభజన హామీలను అన్నింటినీ జగన్ తాకట్టు పెట్టారని అన్నారు. పూర్తిగా మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేశారని గుర్తు చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే మళ్లీ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడానికే అవుతుందని అన్నారు. రుషికొండ ప్యాలెస్‌లు కట్టుకోవడానికే అధికారంలోకి రావాలా? అంటూ ప్రవ్నించారు. కనీసం ప్రాజెక్టులకు జగన్ మరమ్మతులు కూడా చేయించలేదని వైఎస్ షర్మిల ఆరోపణలు చేశారు.
ఇచ్చిన హామీలను.. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టిన జగన్ ఇక అధికారంలోకి రారు అంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. దేవుడు బంగారుపళ్లెంలో అన్నం పెట్టి ఇస్తే.. ఆ అవకావాన్ని దుర్వినియోగం చేసుకున్నారని అన్నారు. వైసీపీపై ప్రజలు నమ్మకం కోల్పోయారని అన్నారు. కాబట్టి వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తారని తాము అనుకోవడం లేదన్నారు. అలాగే.. వైసీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారంపై వైఎస్ షర్మిల స్పందించారు. పిల్ల కాలువలు ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందే అన్ని వ్యాఖ్యానించారు. ఒక వేర వారు కాంగ్రెస్‌లో కలుస్తామంటే స్వాగతిస్తామని చెప్పారు. వైసీపీ చీఫ్‌తో కాంగ్రెస్ చర్చలు జరిపిందనే వార్తలు అవాస్తవమని వైఎస్ షర్మిల చెప్పారు.