అసెంబ్లీకి వెళ్లకపోతే.. జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి: షర్మిల

వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై.. వైఎస్ షర్మిల మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on  28 July 2024 6:45 AM GMT
andhra pradesh, congress, sharmila,   ycp, jagan

అసెంబ్లీకి వెళ్లకపోతే.. జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి: షర్మిల

వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై.. వైఎస్ షర్మిల మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టిన వైఎస్ షర్మిల.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అని వ్యాఖ్యానించడం జగన్‌ అజ్ఞానానికి నిదర్శమని విమర్శించారు. ఇంతకుమించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడా లేవని అన్నారు. మోసం చేయడం కొత్తేమీ కాదన్నారు. ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలను అవమానించేలా మాట్లాడటం జగన్‌కే చెల్లిందని అన్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని జగన్ హేళన చేయడం దివాళాకోరుతనం అంటూ తీవ్ర విమర్శలు చేశారు వైఎస్ షర్మిల.

జగన్‌ సీఎంగా ఉన్న ఐదేళ్ల పాలన అంతా అవినీతి, దోపిడీమయంగానే కొనసాగిందంటూ షర్మిల ఆరోపణలు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని అన్నారు. నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే.. తాపీగా ప్యాలెస్‌లో కూర్చొని ప్రెస్‌మీట్‌లు పెడతారా అని అన్నారు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది ఇందుకేనా అంటూ షర్మిల జగన్‌ను ప్రశ్నించారు. పాలకుల విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు.. ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ అఫ్ ది హౌస్ లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా? అంటూ ఎక్స్‌లో వైఎస్ షర్మిల ప్రశ్నలను సంధించారు. అసెంబ్లీకి పోనని చెప్పే జగన్.. ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారంటూ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. ప్రజాతీర్పును గౌరవించకుండా, అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదని వ్యాఖ్యానించారు.



Next Story