సీపీఎం, సీపీఐతో కలిసి ప్రజా సమస్యలపై పోరాడతాం: షర్మిల

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

By Srikanth Gundamalla  Published on  23 Feb 2024 6:17 AM GMT
andhra pradesh, congress, sharmila, cpi, cpm,

 సీపీఎం, సీపీఐతో కలిసి ప్రజా సమస్యలపై పోరాడతాం: షర్మిల 

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. బీజేపీని కూడా కలుపుకొని పోయే దిశగా చర్యలు జరుగుతున్నాయి. ఇక అధికార పార్టీ వైసీపీ మాత్రం తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామనీ.. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మరోసారి రిపీట్ అవుతాయని అంటున్నారు. ఇక ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న షర్మిల.. ఆ పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్‌ను ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ షర్మిలతో సీపీఎం, సీపీఐ నేతలు సమావేశం అయ్యారు. పొత్తులపై చర్చించారు.

ఈ సందర్బంగా మాట్లాడిన వైఎస్ షర్మిల పొత్తుల అంశంపై కీలక కామెంట్స్ చేశారు. బీజేపీకి వైసీపీ, టీడీపీలు బీటీములుగా ఉన్నాయని ఆమె ఆరోపించారు. వీరి అరాచకాలను అడ్డుకునేందుకు సీపీఎం, సీపీఐతో కలిసి ఏపీ కాంగ్రెస్ పనిచేస్తుందని చెప్పారు. నేటి నుంచే ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పనిచేస్తామని షర్మిల చెప్పారు. బీజేపీ, వైసీపీని దెబ్బకొట్టేలా ఇక ముందు పనిచేస్తామని అన్నారు. అయితే.. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో పొత్తులపైనా చర్చ జరిగిందని అన్నారు. ముందు ప్రజా సమస్యలపై పోరాడతామని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే ఈ నెల 26న రాష్ట్రానికి వస్తున్నారనీ సభ ఉంటుందని షర్మిల చెప్పారు. వామపక్ష నేతలతో మరోసారి భేటీ అవుతామన్నారు.

భవిష్యత్లో తప్పకుండా కలిసి పనిచేస్తామనీ.. కలిసి పోటీ చేసేందుకు అవకాశాలు ఉన్నాయని వైఎస్ షర్మిల చెప్పారు. అతిపెద్ద అవినీతి పార్టీలను తరిమికొట్టేందుకు కలిసి వెళ్లాల్సిన అవసరం ఉందని షర్మిల అన్నారు. ఇక ఏపీకి కాంగ్రెస్‌ వల్లే న్యాయం జరుగుతుందనీ.. ప్రజలకు మంచి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ విమర్శలు చేశారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలే అందుకు కారణమంటూ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విభజన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండి ఉంటే హోదా అప్పుడే వచ్చేది చెప్పారు. టీడీపీ, వైసీపీలు ప్రజల కోసం పనిచేయలేదంటూ వైఎస్ షర్మిల విమర్శలు చేశారు.


Next Story