ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు
ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పర్యటించనున్నారు వైఎస్ షర్మిల. ఈ మేరకు ఆమె పర్యటన షెడ్యూల్ ఖరారు అయ్యింది.
By Srikanth Gundamalla Published on 22 Jan 2024 1:00 PM ISTఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకున్నారు. కొద్ది నెలల్లోనే ఏపీలో సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీకి పునర్‌వైభవం తెచ్చే బాధ్యతలు షర్మిల భుజాలపై పడింది. ఒకవైపు అధికార వైసీపీ, తన అన్న సీఎం జగన్.. మరోవైపు పటిష్టంగా కనిపిస్తోన్న టీడీపీ-జనసేనలను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ మేరకు ఆమె పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జిల్లాల పర్యటనలకు సిద్ధం అయ్యారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పర్యటించనున్నారు వైఎస్ షర్మిల. ఈ మేరకు ఆమె పర్యటన షెడ్యూల్ ఖరారు అయ్యింది.
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా షర్మిల పర్యటన కొనసాగనుంది. పార్టీలోని కీలక నేతలను కలుపుకొని ముందుకు వెళ్లనున్నారు. ఇక యువతరం నేతలతో కూడా షర్మిల చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌తో అనుబంధం గల నేతలతో కేవీపీ చర్చలు జరుపుతున్నారని సమాచారం. కొత్త, పాత తరం నేతల కలయికతో పార్టీని బలోపేతం చేసి ఎన్నికలకు సిద్దం అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
జనవరి 23వ తేదీ నుంచి శ్రీకాకకుళం జిల్లా నుంచి వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. జనవరి 23న పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో వైఎస్ షర్మిల పర్యటిస్తారు. ఆ తర్వాత 24వ తేదీన విశాఖ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో స్థానిక నేతలతో వైఎస్ షర్మిల సంప్రదింపులు జరపున్నారు. ఇక 25వ తేదీన కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటన కొనసాగుతుంది. జనవరి 26న తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలు, 27న కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు, 28న బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, 29వ తేదీన తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఏపీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షురాలు షర్మిల పర్యటన కొనసాగనుంది. జనవరి 30న శ్రీసత్యసాయి జిల్లా, అనంతపురం, కర్నూలు, 31న నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో షర్మిల పర్యటన ఉండనుంది. ఇక ఆరోజు ఇడుపులపాయతో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పర్యటన ముగుస్తుంది.